220 మంది మృతి.. జర్నలిస్టులను కాపాడండి..!

4 Sep, 2018 16:02 IST|Sakshi
దేవులపల్లి అమర్‌ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : గతకొంత కాలంగా తెలంగాణలో జరుగుతున్న జర్నలిస్ట్‌ల మరణాలపై ఢిల్లీలో టీయూడబ్య్లూజే ధర్నాను నిర్వహించింది. ‘జర్నలిస్ట్‌లను కాపాడండి’ అంటూ ఢిల్లీ పార్లమెంట్‌ స్ట్రీట్‌లో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమానికి వామపక్ష పార్టీల నేతలు.. సురవరం సుధాకర్‌ రెడ్డి, సీతారా ఏచూరి, డీ రాజా హాజరై సంఘీభావం తెలిపారు. ఎన్‌యూజే నేత రాజ్‌ బిహారీ, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పెంటపాటి పుల్లారావు, ఐజేయూ సెక్రటరీ జనరల్‌ దేవులపల్లి అమర్‌, ఐజేయూ నేత శ్రీనివాస్‌ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో గత నాలుగేళ్ల కాలంలో మరణించిన 220 మంది జర్నలిస్టులపై పుస్తకాన్ని విడుదల చేశారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన జర్నలిజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదని, ఇంత పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు ఏ రాష్ట్రంలో కూడా మరణించలేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు.

జర్నలిజం కత్తిమీద సాములాంటి వృత్తని.. జర్నలిస్ట్‌ల సమస్యలను కారుణ్య దృష్టితో చూడొద్దని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి పేర్కొన్నారు. జర్నలిస్ట్‌ల సమస్యలను కేసీఆర్‌ పట్టించుకోవడం లేదని.. అందుకే  31 జిల్లాల జర్నలిస్టులు వచ్చి ఢిల్లీలో ధర్నా చేపట్టారని ఐజేయూ సెక్రటరీ జనరల్‌ అమర్‌ విమర్శించారు. తెలంగాణలో చనిపోయిన 220 మంది జర్నలిస్టులవి అసహజ మరణాలని, శ్రమ దోపిడి కారణంగానే వారు చనిపోయారని అన్నారు. కేసీఆర్‌ ఎవరితో మాట్లాడకుండా ఓ గడీని నిర్మించుకున్నారని, తెలంగాణలో నిరసన తెలిపే అవకాశం లేకుండా ధర్నాచౌక్‌ను ఎత్తివేశారని ఆయన మండిపడ్డారు. వందలాది జర్నలిస్టులు చనిపోయినా ప్రభుత్వంలో చలనం లేదని.. వారికి తగిన గుణపాఠం చెప్పాలని ఐజేయూ నేత శ్రీనివాస్‌ రెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు