పాకిస్థాన్‌తో టీవీ యాంకర్ల యుద్ధం

16 Feb, 2019 17:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన టెర్రరిస్ట్‌ దాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి పాకిస్థాన్‌పై యుద్ధం చేయాల్సిందేనంటూ పలు ప్రాంతీయ టీవీలతోపాటు పలు జాతీయ టీవీ ఛానళ్ల యాంకర్లు తీర్మానించడమే కాదు, ఇటు కేంద్ర ప్రభుత్వానికి, అటు భారత సైన్యానికి వెంటనే కదన రంగంలోకి దూకాల్సిందిగా శనివారం పదే పదే పిలుపునిచ్చారు. దేశ ప్రజలందరు కూడా ఇదే కోరుకుంటున్నారని తేల్చి చెప్పారు. తెలుగు టీవీ యాంకర్‌ రష్మీ అవేశంతో ఊగిపోతూ పాకిస్థాన్‌పై రెండో సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేయాలంటూ ‘తెర మాకీ....’ అంటూ రెచ్చిపోయారు. పాకిస్థాన్‌పై ఎలా బదులు తీర్చుకోవాలో తేల్చుకోవడానికి అఖిల పక్ష సమావేశాలతో ప్రధాని నరేంద్ర మోదీ తర్జనభర్జనలు పడుతుండగానే ‘పరిమిత యుద్ధం కోసం అన్ని పర్యవసానాలకు మోదీ సిద్ధంగా ఉన్నారు’ అంటూ ఎవరికి తోచిన వ్యాఖ్యానాలు వారు చేస్తూ వస్తున్నారు. ‘ప్రతీకారం కోరుకుంటున్న భారత్‌’ అన్న నినాదంతోనే ‘రిపబ్లిక్‌ టీవీ’ వార్తలను ప్రసారం చేసింది. సీనియర్‌ జర్నలిస్ట్, యాంకర్‌ అర్నాబ్‌ గోసామి మాట్లాడుతూ ‘పాక్‌తో యుద్ధం చేయడం మినహా మరో మార్గం ఉందా ? లేదు!’ అంటూ సెలవిచ్చారు. ‘పాకిస్థాన్‌ విషయంలో ఇక వెనక్కి తిరిగి వచ్చే పరిస్థితి లేదు’ అంటూ టైమ్స్‌ నౌ యాంకర్‌ నావికా కుమార్‌ వ్యాఖ్యానించారు.

 ‘ ఓ భారత ప్రధాని ప్రజలనుద్దేశించి ఇంత స్పష్టంగా మాట్లాడడం ఇదే మొదటి సారి. పాకిస్థాన్‌తో పరిమిత యుద్ధం కోసం అన్ని పర్యవసానాలను ఎదుర్కోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. దేశ ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు’ అని ఇండియా టుడే టీవీ యాంకర్‌ రాహుల్‌ కన్వల్‌ వ్యాఖ్యానించారు. ‘పాకిస్థాన్‌లోని అన్ని టెర్రరిస్టు స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు జరపాలి’ అంటూ న్యూస్‌ 18 యాంకర్‌ భూపేంద్ర చౌబే పిలుపునిచ్చారు. యుద్ధానికి సమయం ఆసన్నమైందంటూ 2016లో భారత సైన్యం నిర్వహించిన సర్జికల్‌ దాడులను ప్రస్తావిస్తూ ఏబీపీ న్యూస్‌ ఛానల్‌ అయితే ఇటీవల విడుదలైన ‘యురి’ బాలివుడ్‌ సినిమాలోని క్లిప్స్‌ను చూపించారు.

యాంకర్ల పిలుపులపై ‘ఎన్డీటీవీ ఇండియా’ రవిష్‌ కుమార్‌ తనదైన శైలిలో స్పందించారు. ‘మన సైనికులు మరణించినందుకు మనకు బాధగా ఉంటుంది. మనసు ప్రతీకారం కోరుకుంటుంది. ఇక్కడే కాస్త సంయమనం అవసరం. అరుపులు, కేకలు వినిపించడానికి ప్రతి సంఘటన ఓ సినిమా ప్లాట్‌ కాదు. రెచ్చగొట్టే భాష రాజకీయ ప్రయోజనాలను నెరవేరుస్తుంది. సమస్యను పరిష్కరించదు. ఈ సమయంలో మనం మౌనం పాటించడమే అమర వీరులకు నిజమైన నివాళి. మృధువుగా మాట్లాడుతాం. బాధిత కుటుంబాల మెదళ్లును తొలుస్తున్న విషయం గురించి ఆలోచిద్దాం. కశ్మీరు పరిస్థితి కంటే మీడియా పరిస్థితి దిగజారినందుకు బాధగా ఉంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.

కార్గిల్‌ వీరుడి అమూల్య సందేశం
‘జీ న్యూస్‌’ చర్చాగోష్టిలో పాల్గొన్న 1999లో పాకిస్థాన్‌తో జరిగిన కార్గిల్‌ యుద్ధంలో పాల్గొని కుడి కాలును కోల్పోయిన యోధుడు మేజర్‌ నవదీప్‌ సింగ్‌ చాలా బాధ్యుతాయుతంగా స్పందించారు. ‘దేశ త్రివర్ణ పతాకానికి అండగా ప్రాణాలర్పించేందుకు ప్రతి సైనికుడు సిద్ధంగానే ఉన్నారు. ఒకప్పుడు టెర్రరిస్టయిన నజీర్‌ వానిలాగా ఓ కశ్మీర్‌ యువకుడు ఎందుకు కావాలనుకుంటున్నాడో కూడా ఆలోచించాలి. ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. యుద్ధం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ప్రాణాలే కాదు, అవయవాలు కూడా పోతాయి. ఆ తర్వాత నష్ట పరిహారం కోసం కోర్టుల తలుపులు తట్టాలి.

యుద్ధంలో సైనికుడు చనిపోవాలని మనం కోరుకుంటాం. ఆ తర్వాత ఆ సైనికుడి వితంతు భార్య పింఛను కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. యుద్ధంలో కొన్నిసార్లు మృతదేహం ఆనవాళ్లు కూడా దొరకవు. పింఛను కావాలంటే భర్త మతదేహాన్ని తీసుకరావాలని అధికార యంత్రాంగం ఆదేశిస్తుంది. యుద్ధంలో గాయపడితే అంగవైకల్య నష్టపరిహార పింఛను కోసం ఏళ్లకు ఏళ్లు కోర్టుల చుట్టూ తిరగాలి. యుద్ధంలో కాలు కోల్పోయిన నేను పింఛను కోసం ఏడేళ్లు కోర్టుల చుట్టూ తిరిగాను. సైనిక పింఛను విషయంలో కేంద్ర ప్రభుత్వం అప్పీళ్లను ఉపసంహరించుకోవాల్సిందిగా సుప్రీం కోర్టు స్వయంగా ఆదేశించినప్పటికీ ఇప్పటికీ వెయ్యి కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రాణాలతో పరాచకాలొద్దు. అన్యాయంగా సైనికుల ప్రాణాలను బలిపెట్టవద్దు. భారత సైన్యానికి ఎప్పుడు ఎలా స్పందించాలో తెలుసు. ఎం చేయాలో వారికి మనం సూచించాల్సిన అవసరం లేదు. సముచిత సమయంలో సముచిత చర్య తీసుకోవడం వారికి తెలుసు. ముందుగా పాకిస్థాన్‌ను టెర్రరిస్టు దేశంగా ప్రపంచం ప్రకంటించేలా దౌత్యపరమైన ఒత్తిడి తీసుకరావాలి. భావ ప్రకటన స్వేచ్ఛ ఉందిగదా అంటూ ఆవేశంతో మాట్లాడడం సముచితం కాదు’ అని ఆయన తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. అయినా ‘సార్‌! మీరు పుల్వామా దాడి చిత్రాలను చూసినట్లు లేదు. ప్రతీకారం ఒక్కటే పరిష్కారమని మీరు భావించకపోవడానికి అదే కారణం అనుకుంటా’ అని జీన్యూస్‌ యాంకర్‌ వ్యాఖ్యానించడం కొసమెరపు.


 

మరిన్ని వార్తలు