సారూ.. విషెస్ అలా చెప్పకూడదు!

26 Mar, 2016 12:16 IST|Sakshi
సారూ.. విషెస్ అలా చెప్పకూడదు!

పర్వదినాల సందర్భంగా శుభాకాంక్షలు, శుభవచనాలు తెలిపే విషయంలోనూ బీజేపీ నేతలకు ఆన్‌లైన్‌లో మొట్టికాయలు పడ్డాయి. ఇద్దరు బీజేపీ సీనియర్‌ నేతలు 'గుడ్‌ ఫ్రైడే' సందర్భంగా ట్విట్టర్‌లో చెప్పిన శుభాకాంక్షలు నెటిజన్లకు ఆగ్రహం తెప్పించాయి. ఏ పర్వదినానికి ఎలా విషెస్‌ చెప్పాలో కాస్తా తెలుసుకొని సున్నితంగా మసులుకోండి అంటూ నెటిజన్లు ఆ నేతలకు పాఠాలు చెప్పారు.

సాక్షాత్తూ కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్‌ శర్మ శుక్రవారం ఉదయం అసంబద్ధమైన విషెస్ చెప్పారు. 'మీకు శుభసౌఖ్యాలు కలుగాలని కోరుకుంటున్నా. హ్యాపీ గుడ్‌ఫ్రైడే' అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. ఇది ఆన్‌లైన్‌ ట్రోల్‌ కావడంతో ఆయన వెంటనే తన ట్వీట్‌ను డిలీట్ చేశారు. మరోవైపు బీజేపీ సీనియర్ నేత షానవాజ్ హుస్సేన్‌ 'వార్మ్‌ గ్రీటింగ్స్ ఆన్ గుడ్ ఫ్రైడే టు ఆల్‌ ఆఫ్ యూ' అంటూ ట్వీట్‌ చేశారు. దీనిపై విమర్శలు వచ్చినా ఆయన తొలగించలేదు.

యేసు క్రీస్తుకు శిలువ వేసిన సందర్భాన్ని స్మరించుకుంటూ ఉపవాస దీక్షలతో, ప్రార్థనలతో, ప్రాయోశ్చిత్త భావనతో గుడ్‌ ఫ్రైడేను ప్రపంచవ్యాప్తంగా జరుపుకొంటారు. ఈ రోజును సంస్మరణ దినంగా భావిస్తారు. బీజేపీ నేతల ట్వీట్‌ గ్రీటింగ్లపై నెటిజన్లు ఘాటుగా స్పందించారు. గుడ్‌ ఫ్రైడే ఉద్దేశమేమిటో, ఆ రోజున జీసెస్ క్రైస్ట్ ఏం బోధించాడో దయచేసి వారికి చెప్పండి.. మొహర్రం రోజున హ్యాపీ మొహర్రం అని విషెస్ చెప్పినట్టు ఉంది వీరి తీరు అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు