నా ప్రధాని మంచి మనస్సున్న మనిషి

7 Sep, 2019 11:51 IST|Sakshi
కే శివన్‌ను ఓదార్చుతున్న ప్రధాని మోదీ

ఇస్రో శాస్త్రవేత్తలకు ధైర్యం నూరిపోసిన మోదీ

సోషల్‌ మీడియాలో ప్రశంసల జల్లు

సాక్షి, బెంగళూరు:  భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రయోగం.. చివరిక్షణంలో కుదుపులకు లోనైన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇస్రో చీఫ్‌ కే శివన్‌ను కలిసి ఓదార్చారు. ఎంతో శ్రమతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రూ. వెయ్యికోట్లు విలువైన చంద్రాయన్‌-2 ప్రాజెక్టు చివరిక్షణంలో చేదు ఫలితాన్ని ఇవ్వడంతో శివన్‌ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ప్రధాని మోదీని కలిసిన సమయంలో భావోద్వేగం తట్టుకోలేక చిన్నపిల్లాడిలా కన్నీటి పర్యంతమయ్యారు. శివన్‌ పరిస్థితిని గమనించిన ప్రధాని మోదీ ఆయనను గుండెలకు హత్తుకుని ఓదార్చారు. వెన్నుతట్టి ధైర్యం చెప్పారు. శాస్త్రవేత్తల అంకితభావాన్ని ఎవరూ శంకిం‍చలేరని, భవిష్యత్తులో విజయాలు సాధిస్తారంటూ ఆయనలో మోదీ ధైర్యం నింపారు.  

అంతకుముందు బెంగళూరులోని ఇస్రో కంట్రోల్‌ రూమ్‌లో రాత్రంతా నిద్రపోకుండా గడిపిన ప్రధాని మోదీ.. విక్రమ్‌ ల్యాండర్‌ జాబిల్లి ఉపరితలంపై ల్యాండ్‌ అయ్యే ప్రక్రియను  ఆసాంతం ప్రత్యక్షంగా వీక్షించారు. అయితే, చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు సవ్యంగా సాగిన విక్రమ్‌ ల్యాండర్‌ పయనం.. అక్కడ కుదుపునకు లోనవ్వడంతో ల్యాండర్‌ నుంచి ఇస్రో గ్రౌండ్‌ సెంటర్‌కు సిగ్నల్స్‌ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్లిష్ట సమయంలో ప్రధాని మోదీ ఒక దార్శనికుడైన నాయకుడిలా మానవీయంగా వ్యవహరించారు. శాస్త్రవేత్తల్లో ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేశారు. దాదాపు చంద్రుడి ఉపరితలం వరకు ల్యాండర్‌ను తీసుకెళ్లిన ఇస్త్రో శాస్త్రవేత్తల కృషిని ఘనంగా ప్రశంసిస్తూనే.. ఈ వైఫల్యాన్ని కుంగిపోకుండా భవిష్యత్తులో మరిని విజయాలు సాధించేదిశగా ముందడుగు వేయాలని శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మోదీ ప్రదర్శించిన నాయకత్వ దార్శనికతపై ట్విటర్‌లో ప్రశంసల జల్లు కురుస్తోంది.

స్ఫూర్తిదాయక నాయకత్వం అంటే ఇదేనని, ఈ వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకుంటామని మోదీని ప్రశంసిస్తూ ఇస్రో కన్నడ అకౌంట్‌ ట్విటర్‌లో కామెంట్‌ చేసింది. భారత్‌, శ్రీలంకలో ఇజ్రాయెల్‌ రాయబారిగా పనిచేసిన డానియెల్‌ కామెరాన్‌ కూడా మోదీ నాయకత్వ శైలిని కొనియాడారు. నా ప్రధాని మనసున్న మనిషి అని ఒక నెటిజన్‌ కామెంట్‌ చేయగా.. ప్రధాని మోదీ, ఇస్రో చీఫ్‌ శివన్‌ కోట్లాది భారతీయుల హృదయాలను గెలుచుకొన్నారని మరొకరు ట్వీట్‌ చేశారు. క్లిష్ట సమయంలో మోదీ శివన్‌ను హత్తుకొని సముదాయించడం ఇస్రోలో అమూల్యమైన నైతిక స్థైర్యాన్ని నింపి ఉంటుందని, ఇది తమ హృదయాలను హత్తుకుందని మరొక నెటిజన్‌ పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు రవిశంకర్‌ ప్రసాద్‌, కిరణ్‌ రిజిజు, పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు సైతం ప్రధాని మోదీ వ్యవహరించిన తీరును కొనియాడుతున్నారు. భవిష్యత్తు పట్ల ఆశావాదం, విశ్వాసం కల్పించే దార్శనిక నాయకుడిలా మోదీ వ్యవహరించారని, క్లిష్ట సమయంలో ఇస్రోకు యావత్‌ దేశం, ప్రజలు అండగా ఉన్నారనే సందేశాన్ని ఆయన ఇచ్చారని నెటిజన్లు అంటున్నారు.
 

మరిన్ని వార్తలు