మార్స్‌పై ‘ఇన్‌సైట్‌’ తొలి అడుగు 

28 Nov, 2018 02:34 IST|Sakshi

అరుణ గ్రహంపై విజయవంతంగా దిగిన ల్యాండర్

మార్స్‌ అంతర్భాగ అధ్యయనానికి పంపిన నాసా 

రెండు మూడు నెలల నుంచే కీలక సమాచారం అందుబాటులోకి! 

వాషింగ్టన్‌: మానవ ఆవాసానికి అనుకూలమైనదిగా భావిస్తున్న అంగారక గ్రహ లోగుట్టు కనిపెట్టేందుకు మరో ముందడుగు పడింది. ఆ గ్రహం అంతర్భాగాన్ని అధ్యయనం చేయడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తొలిసారిగా ప్రయోగించిన రోబో ఆధారిత ల్యాండర్‌ ‘ఇన్‌సైట్‌’ విజయవంతంగా గ్రహంపై దిగింది. ఇన్‌సైట్‌ సుమారు ఆరు నెలల సుదీర్ఘ ప్రయాణం చేసి అంగారకుడి మధ్యరేఖ ‘ఎలీసియమ్‌ ప్లానీషియా’కు దగ్గర్లో దిగింది. ల్యాండర్‌లో అమర్చిన సౌర పలకలు తెరుచుకుని, సౌర శక్తిని గ్రహిస్తున్నట్లు ఛాయాచిత్రాలు వెలువడ్డాయి. అంగారక ఉపరితలంపై ఇన్‌సైట్‌ దిగుతున్న చిత్రాలు మంగళవారం ఉదయమే భూమికి చేరాయని నాసా తెలిపింది. ప్రయోగం అంతా సవ్యంగా సాగిందని, ఎలాంటి సమస్యలు లేకుండా ఇన్‌సైట్‌ పని ప్రారంభించిందని తెలిపింది. కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్‌ ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌ నుంచి మే 5న ఈ ప్రయోగం చేపట్టారు. ఇన్‌సైట్‌ వెంట రెండు చిన్న ఉపగ్రహాల(మార్కో క్యూబ్‌శాట్స్‌)ను పంపారు. మార్స్‌ అంతర్భాగాన్ని అధ్యయనం చేసి రెండు, మూడు నెలల తరువాతి నుంచి విలువైన సమాచారం, ఫొటోల్ని పంపనుంది. ఈ ల్యాండర్‌ 2020, నవంబర్‌ 24 వరకు సేవలందిస్తుంది. ఈ సమయం అంగారకుడిపై సుమారు 405 రోజులకు సమానం. తాజా ప్రయోగంతో అంగారక గ్రహంపైకి నాసా చేపట్టిన 8వ మిషన్‌ విజయవంతమైనట్లయింది.

ప్రయోగం విశేషాలు
►ఇన్‌సైట్‌ గంటకు 19,800 కి.మీ వేగంతో ప్రయాణించి అంగారకుడిని చేరింది. 
►అంగారకుడిపై ఇన్‌సైట్‌ ల్యాండింగ్‌ ప్రక్రియ కేవలం ఆరున్నర నిమిషాల్లోనే ముగిసింది. 
►ఆ వెంటనే ఇన్‌సైట్‌ పని ప్రారంభించడంతో..16 నిమిషాల్లో దాని సోలార్‌ పలకలు విచ్చుకుని సౌర శక్తిని గ్రహించడం మొదలుపెట్టాయి. 
►వారం రోజుల తరువాత ఇన్‌సైట్‌ సైన్స్‌ డేటా సేకరణను ప్రారంభిస్తుంది. 
►ఇన్‌సైట్‌లో అమర్చిన రోబోను పరిశోధకులు రెండు రోజుల తరువాత రంగంలోకి దింపుతారు. 
►రెండు, మూడు నెలల్లో రోబో..ఈ మిషన్‌లో అంతర్భాగమైన సీస్మిక్‌ ఎక్స్‌పరిమెంట్‌ ఇంటీరియర్‌ స్ట్రక్చర్‌(సీస్‌), హీట్‌ ఫ్లో అండ్‌ ఫిజికల్‌ ప్రాపర్టీస్‌ ప్యాకేజ్‌(హెచ్‌పీ3) పరికరాల్ని మోహరిస్తుంది. వీటితోనే ►అంగారకుడి సమాచారం పొందడానికి వీలవుతుంది. 
►ఆ తరువాత రోబో పాత్ర క్రమంగా కనుమరుగవుతుంది. 
►అంతకు ముందు, మిషన్‌లో అమర్చిన కెమెరాలు పంపే అంగారక ఉపరితల చిత్రాల ఆధారంగా ఆ పరికరాల్ని ఎక్కడ అమర్చాలో పరిశోధకులు నిర్ణయిస్తారు. 
►ఆలోపు, వాతావరణ సెన్సార్‌లు, మాగ్నెటో మీటర్‌ ఉపయోగించుకుని ఇన్‌సైట్‌ తన కొత్త ఆవాసం అయిన ’ఎలీసియమ్‌ ప్లానీషియా’లోని పరిస్థితుల గురించి సమాచారం అందజేస్తుంది. 
►అంగారకుడిపై ఇన్‌సైట్‌ కదలికల్ని మార్కో క్యూబ్‌శాట్స్‌ పరిశీలించి ఆ చిత్రాల్ని భూమికి పంపుతాయి.  

మరిన్ని వార్తలు