ఏమయ్యారు!

18 Sep, 2017 13:25 IST|Sakshi
జోగేశ్వర హరిజన్‌ , సంజయ గోండ్‌

ఖుడుకు ఆదివాసీ సేవాశ్రమ హాస్టల్‌లో కనిపించని ఇద్దరు విద్యార్థులు
ఓ వ్యక్తి తీసుకెళ్లినట్టు తోటి విద్యార్థుల వెల్లడి
ఆంధ్రప్రదేశ్‌కు తీసుకువెళ్లాడని పోలీసుల అనుమానం  


జయపురం :
నవరంగపూర్‌ జిల్లా రాయిఘర్‌ సమితి ఖుడుకు గ్రామంలో ఆదివాసీ సేవాశ్రమ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు కనిపించడం లేదు. ఈ నెల 13వ తేదీ నుంచి వీరి ఆచూకీ లేదని సమాచారం. హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థుల భద్రతకు సంబంధిత అధికారులు ఎంత బాధ్యతగా పనిచేస్తున్నారో ఈ సంఘటన వెల్లడిస్తుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఖుడుకు ఆదివాసీ సేవాశ్రమ పాఠశాలలో 13వ తేదీ నుంచి ఇద్దరు విద్యార్థులు కనిపించకపోయినా ఈ విషయం 14వ తేదీన గాని పాఠశాల అధికారులు తెలుసుకోలేకపోయారు. కనిపించకుండా పోయిన ఆ విద్యార్థులు 6వ తరగతి చదువుతున్న సంజయ గోండ్, జోగేశ్వర హరిజన్‌. 13వ తేదీన ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పాఠశాలకు రాలేదని తెలిసింది. 14వ తేదీన వచ్చిన ప్రధానోపాధ్యాయురాలు సబిత ముఝుందార్‌ విద్యార్థుల హాజరు వివరాలు తీసుకుంటున్న సమయంలో ఇద్దరు విద్యార్థులు లేకపోవటం గుర్తించారు. హాస్టల్‌లో ఉండాల్సిన ఆ ఇద్దరు విద్యార్థులు ఏమయ్యారని ఆమె విచారణ జరిపారు.

ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆ ఇరువురు విద్యార్థులను పిలిచి తీసుకువెళ్లారని మిగతా విద్యార్థులు వెల్లడించారు. ఎవరు వచ్చారు, అనుమతి లేకుండా వారిని ఎవరు తీసుకువెళ్లారు, అన్నదానిపై చర్చించిన ఆమె ఈ విషయం వారి తల్లిదండ్రులకు తెలియజేసేందుకు వారిని పాఠశాలకు పిలిపించారు. వారు వచ్చిన తర్వాత వారి పిల్లలు కనిపించటంలేదని ఎవరో వచ్చి వారిని తీసుకువెళ్లినట్టు విద్యార్థులు తెలిపిన విషయాన్ని వారికి చెప్పారు. ప్రధానోపాధ్యాయురాలు తెలిపిన విషయం విని వారి తల్లిదండ్రలు ఆందోళనకు గురయ్యారు. హాస్టల్‌లో ఉన్న విద్యార్థుల భద్రత మీది కాదా అని వారు ఆమెను ప్రశ్నించినట్టు సమాచారం. అయితే వారికి సముదాయ పరచి ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేయమని వారికి సూచించగా సంజయ గోండ్‌ తండ్రి నంద గోండ్‌ అతని భార్య కలిసి కుందెయి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

బయట ప్రపంచానికి శనివారం వెలుగుచూచిన ఈ సంఘటన జిల్లాలో చర్చనీయమైంది. ఆదివాసీ హరిజన సంక్షేమ హాస్టల్‌ల్లో, పాఠశాలల్లో విద్యార్థులకు రక్షణ లేకుండా పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తమ బిడ్డలు కనిపించకుండా పోయేందుకు కారణం ప్రధానోపాధ్యాయురాలు, పాఠశాల, హాస్టల్‌ సిబ్బంది నిర్లక్ష్యమే కారణంగా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో తక్షణం దర్యాప్తు జరిపించి తమ బిడ్డలను కాపాడాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఇరువురు విద్యార్థులను తీసుకుపోయిన వ్యక్తి వారిని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకువెళ్లినట్టు అనుమానాలు ఉన్నాయని పోలీసు అధికారి భవానీ మిశ్ర సూచనప్రాయంగా విలేకరులకు తెలిపారు.

ఎవరు తీసుకుపోయారు, ఎందుకు తీసుకువెళ్లారు, వారిని విక్రయించేందుకా లేదా కార్మికులుగా చేర్చేందుకా అన్న చర్చ జరుగుతుంది. ఇద్దరు విద్యార్థుల అపహరణపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయమని ఆ సేవాశ్రమ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలిని నవరంగపూర్‌ జిల్లా సంక్షేమ అధికారి ఆదేశించినట్టు తెలిసింది. తరచూ ఇటువంటి ఏదో ఒక సంఘటన ప్రభుత్వ ఆదివాసీ హరిజన సేవాశ్రమాలలో చోటు చేసుకుంటున్నా సంబంధిత అధికారులు నిర్లక్ష్య వైఖరి అవలవబిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. అపహరించబడినట్టు ఆరోపించబడుతున్న ఆ ఇద్దరు విద్యార్థులను కాపాడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా