డ్రైనేజీలో మరో రెండు మృతదేహాలు

1 Mar, 2020 18:20 IST|Sakshi

రెండు మృతదేహాలను గుర్తించిన ఢిల్లీ పోలీసులు

సాక్షి, న్యూఢిల్లీ :  దేశ రాజధాని ఢిల్లీలోని యమున నది కాల్వలో గుర్తుతెలియని రెండు మృతదేహాలు బయటపడం కలకలం రేపింది. గోకుల్‌పూరిలోని యమున తూర్పు కాల్వ డ్రైనేజీలో ఆదివారం.. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న రెండు శవాలను ఢిల్లీ పోలీసులు కనుగొన్నారు. మృతదేహాలు ఎవరివి అనేది ఇంకా తేలాల్సి ఉంది. అయితే ఈ శవాలు గుర్తుపట్టలేనంతగా కుళ్లిపోవడంతో వాటిని గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది. ప్రమాదశాత్తు కాల్వలో పడి మరణించారా..? లేక ఢిల్లీ అల్లర్లలో భాగంగానే వీరు కూడా మృతి చెందారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. డెడ్‌బాడీలను పోస్ట్‌మార్టం నిమిత్తం జీటీబీ ఆస్పత్రికి తరలించారు. కాగా ఘర్షణలు చోటుచుకున్న ప్రాంతంలోనే ఈ మృతదేహాలు లభ్యం కావడం గమనార్హం. (ఢిల్లీ అల్లర్లు: డ్రైనేజీలో ఆఫీసర్‌ మృతదేహం)

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన ఘర్షణల్లో గుర్తు తెలియని దుండగులు ఇంటలిజెన్స్‌ బ్యూరో కానిస్టేబుల్‌ అంకిత్‌ శర్మను దారుణంగా హతమార్చి.. మృతదేహాన్ని డ్రైనేజీలో పడేసిన విషయం విదితమే. ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో డ్రైనేజీలో మరో రెండు మృతదేహాలు లభ్యం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఢిల్లీ అల్లర్లో భాగంగానే వీరిని హత్యచేసి.. కెనాల్‌లో పడేశారనే సందేహాలు  వ్యక్తమవుతున్నాయి. దీనిపై పోలీసులు తుది నివేదికను ఇ‍వ్వాల్సి ఉంది. కాగా ఢిల్లీలో చెలరేగిన ఘర్షణల కారణంగా ఇప్పటి వరకు 42 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు