బలపరీక్షకు ముందే రావత్‌కు మరో షాక్‌!

8 May, 2016 19:48 IST|Sakshi
బలపరీక్షకు ముందే రావత్‌కు మరో షాక్‌!

మరో రెండు రోజుల్లో హరీశ్‌ రావత్‌ తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కొనుండగా.. ఆయనకు మరో గట్టి షాక్ తగిలింది. రావత్ తరఫున రెబల్ ఎమ్మెల్యేలకు లంచం ఇచ్చానని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు అంగీకరిస్తున్నట్టు భావిస్తున్న స్టింగ్ ఆపరేషన్ వీడియో బయటపడటం కలకలం రేపుతోంది. స్థానిక న్యూస్ చానెల్ సమాచార్ ప్లస్ ఈ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది.

కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ బిష్ట్‌, రెబల్ ఎమ్మెల్యే హరక్ సింగ్ రావత్‌తో మాట్లాడుతూ.. పదవీచ్యుత సీఎం రావత్‌ తరపున డిప్యూటీ స్పీకర్‌ ఏపీ మైఖూరికి, 12మంది రెబల్ ఎమ్మెల్యేలకు తాను కోట్లాది రూపాయల డబ్బు లంచంగా ముట్టజెప్పినట్టు చెప్పడం ఈ వీడియోలో కనిపిస్తున్నది. కొంతమంది ఎమ్మెల్యేలకు రూ. 25 లక్షల చొప్పున ఇచ్చానని, డిప్యూటీ స్పీకర్ మైఖూరికి రూ. 50 లక్షలు రావత్ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.

అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో రావత్ ప్రభుత్వం మైనారిటీలో పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ 12మందిపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించగా.. సుప్రీంకోర్టు పదవీచ్యుత సీఎం రావత్‌కు ఈ నెల 10న అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోవడానికి అనుమతి ఇచ్చింది. ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేలకు రావత్ లంచాలు ఇవ్వజూపినట్టు ఓ స్టింగ్ ఆపరేషన్ వీడియో వెలుగుచూడగా.. తాజాగా మరో వీడియో వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది.