కుమారస్వామి సర్కార్‌కు ఇద్దరు ఇండిపెండెంట్లు షాక్‌

15 Jan, 2019 16:13 IST|Sakshi

సాక్షి, బెంగళూర్‌ : కర్ణాటకలో హైడ్రామా కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్ధిరపరిచేందుకు బీజేపీ సిద్ధమవుతోందన్న ప్రచారం నేపథ్యంలో ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామికి ఇద్దరు ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేలు మంగళవారం తమ మద్దతు ఉపసంహరించకున్నారు. స్వతం‍త్ర ఎమ్మెల్యేలు హెచ్‌ నగేష్‌, ఆర్‌ శంకర్‌లు జేడీఎస్‌-కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించినట్టు వెల్లడించారు. ప్రభుత్వ మార్పును తాను కోరుకుంటున్న క్రమంలో కుమారస్వామి సర్కార్‌కు మద్దతు ఉపసంహరించాలనే నిర్ణయం తీసుకున్నానని, మకర సంక్రాంతి రోజున ప్రభుత్వ మార్పును అభిలషిస్తున్నామని ఎమ్మెల్యే శంకర్‌ పేర్కొన్నారు.

కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్‌-కాంగ్రెస్‌ సర్కార్‌ సుపరిపాలన, నిలకడైన ప్రభుత్వాన్ని అందించడంలో ఘోరంగా విఫలమైందని మరో ఎమ్మెల్యే ఆర్‌ నగేష్‌ ఆరోపించారు. సంకీర్ణ భాగస్వామ్య పక్షాల మధ్య ఎలాంటి అవగాహన, సమన్వయం లేదని అన్నారు. సుస్ధిర ప్రభుత్వం ఏర్పడే దిశగా తాను బీజేపీతో జట్టుకట్టాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. కాగా, స్వతంత్ర ఎమ్మెల్యేలు ఇరువురు మద్దతు ఉపసంహరించినా తమ సర్కార్‌కు ఎలాంటి ప్రమాదం లేదని కాంగ్రెస్‌ తేల్చిచెప్పింది.

బీజేపీ తమ ఎమ్మెల్యేలను డబ్బు, అధికారం పేరుతో ప్రలోభాలకు గురిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి జీ పరమేశ్వర పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని అస్ధిరపరచాలన్న బీజేపీ ప్రయత్నాలు ఫలించబోవన్నారు. కాగా బీజేపీ ఇప్పటికే తమ ఎమ్మెల్యేలను గురుగావ్‌ రిసార్ట్స్‌కు తరలించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి తర్వాత కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ ఆపరేషన్‌ లోటస్‌ పేరుతో వేగంగా పావులు కదుపుతోంది. కుమారస్వామి సర్కార్‌పై అవిశ్వాస తీర్మానానికి బీజేపీ సన్నాహాలు చేస్తోందని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

మరిన్ని వార్తలు