మందుపాతర పేల్చిన మావోలు

15 Mar, 2020 06:23 IST|Sakshi

ఇద్దరు జవాన్లు మృతి

చర్ల: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. బస్తర్‌ జిల్లాలో శనివారం మందుపాతర పేల్చారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు జవాన్లు మృతి చెందగా మరో జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. బస్తర్‌ రేంజ్‌ ఐజీ పి.సుందర్‌రాజ్‌ కథనం ప్రకారం.. జిల్లాలోని బాన్సూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బొద్లీ–బాల్వాయి గ్రామాల మధ్య రహదారి నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఈ క్రమంలో రోడ్డు పనుల వద్ద భద్రతగా నిలిచేందుకు బాన్సూర్‌ పోలీస్‌ స్టేషన్‌ నుంచి సీఆర్‌పీఎఫ్, ఛత్తీస్‌గఢ్‌ ఆర్ముడ్‌ పోలీస్‌ ఫోర్స్‌కు చెందిన ప్రత్యేక బలగాలు వెళ్తుండగా, మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో ఛత్తీస్‌గఢ్‌ ఆర్ముడ్‌ పోలీస్‌ ఫోర్స్‌కు చెందిన ఉపేందర్‌ సాహూ, దేవేందర్‌ సాహూ మృతిచెందారు. సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌కు తీవ్ర గాయాలు కాగా ప్రత్యేక హెలికాప్టర్‌లో రాయ్‌పూర్‌కు తరలించి వైద్య సేవలనందిస్తున్నారు. మందుపాతర పేల్చిన అనంతరం మావోయిస్టులు, పోలీసులకు మధ్య 15 నిమిషాల పాటు ఎదురుకాల్పులు జరిగాయి. తప్పించుకున్న మావోయిస్టుల కోసం పెద్ద ఎత్తున కూంబింగ్‌ చేపట్టారు. 

మరిన్ని వార్తలు