కన్నడ మాట్లాడలేదని....!

19 Dec, 2017 15:30 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : దేశంలో నెలకొన్న ప్రాంతీయ దురాభిమానాలు వ్యక్తుల్లో సంకుచితత్వాన్ని రెచ్చ గొడుతున్నాయి. కర్ణాటకలో కన్నడం మాట్లాడలేదని అన్నదమ్ములను కొందరు వ్యక్తులు చావగొట్టిన ఘటన బెంగళూరులో జరిగింది. దాదాపు ఐదేళ్లుగా కశ్మీర్‌కు చెందిన అన్నదమ్ములు బెంగళూరులో నివాసముంటున్నారు. ఎప్పటిలానే ఇద్దరు సోదరులు.. డిసెంబర్‌12 రాత్రి.. ఒక స్టార్‌ హోటల్‌లో భోజనం చేసి కారులో ఇంటికి వెళుతున్నారు. సంజయ్‌ నగర్‌లోని ఎన్‌టీఐ బస్టాండ్‌ దగ్గరకు వచ్చాక.. వారిని  పదిమంది యువకులు అడ్డగించారు. కన్నడంలో మాట్లాడాలని డిమాండ్‌ చేశారు.  వారితో సోదరులిద్దరూ కన్నడంలో మాట్లాడకపోవడంతో.. దుండగులు భౌతిక దాడికి దిగారు. కన్నడంలో మాట్లాడ్డం వస్తేనే ఇక్కడ ఉండండి.. లేకపోతే.. కర్ణాటక నుంచి వెళ్లిపోండి అంటూ సోదరులను దుండగులు బెదిరించారు. 


మేం ఉత్తర భారతం నుంచి వచ్చాం.. మేము కన్నడం ఎలా మాట్లాడగలం అంటూ ఇద్దరు సోదరులు వారిని ప్రశ్నించారు. దీంతో మరింత ఆగ్రహించిన దుండగులు సోదరుల కారుపై రాళ్ల వర్షం కురిపించారు. ఈ ఘటనపై బాధితులు బెంగళూరు నార్త్‌  పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై  బెంగళూరు నార్త్‌ డీసీపీ చేతన్‌ సింగ్‌రాథోడ్‌ మాట్లాడుతూ.. ఇది వాస్తమేనని చెప్పారు. నిందితుల్లో ఇద్దరిని గుర్తించినట్లు ఆయన తెలిపారు. నిందితులపై సెక్షన్‌ 341, సెక్షన్‌ 504 కింద కేసులు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. 

మరిన్ని వార్తలు