ఎమ్మెల్యేను చంపిన మావోయిస్టుల హతం

18 Apr, 2019 12:42 IST|Sakshi

రాయ్‌పూర్‌ : బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవీని హత్య చేసిన మావోయిస్టు కమాండర్‌ ఎన్‌కౌంటర్‌లో హతమైనట్టు పోలీసులు తెలిపారు. ఏప్రిల్‌ 9న ఛత్తీస్‌గఢ్‌లో మందుపాతరను పేల్చడంతో దంతెవాడ ఎమ్మెల్యే భీమా మాండవీతో పాటూ మరో నలుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దౌలికర్క అడవుల్లో గురువారం ఉదయం మావోయిస్టులు తిరుగుతున్నట్లు తెలియడంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య హోరాహోరీగా ఎదురుకాల్పులు జరిగాయి. ఓ మావోయిస్టు కమాండర్‌తోపాటూ మరో మావోయిస్టును పోలీసులు మట్టుపెట్టారు.

దీనిపై దంతెవాడ ఎస్పీ అభిషేక్‌ పల్లవ్‌ మాట్లాడుతూ.. బీజేపీ ఎమ్మెల్యే మాండవీని చంపేసిన ఇద్దరు మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో హతమయ్యారని తెలిపారు. హతమైన మావోయిస్టులను వర్గీస్‌, లింగాగా పోలీసులు గుర్తించారు. గాయపడిన మరో మావోయిస్టు దస్రును ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఐఈడీల ఎక్స్‌పర్ట్ అయిన వర్గీస్ పెట్టిన మందుపాతర పేలడంతో ఏప్రిల్ 9న ఎమ్మెల్యే భీమా మండవీ చనిపోయారు. శక్తిమంతమైన పేలుడుకి భీమా మాండవీ ప్రయాణస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఒక్కసారిగా గాల్లోకి లేచి, మాండవీ శరీర భాగాలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. ఈ దాడిలో ఆయనతోపాటూ మరో ముగ్గురు భద్రతా సిబ్బంది, ఓ పోలీస్ డ్రైవర్ కూడా చనిపోయారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో 3 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిని బహిష్కరించిన మావోయిస్టులు ప్రజలెవ్వరూ ఓటు వెయ్యొద్దని పిలుపునిచ్చారు. ఆ క్రమంలో ప్రజలను భయపెట్టేందుకు అడవుల్లో తిరుగుతున్నట్లు తెలిసింది. తాజా కాల్పుల్లో ఘటనా స్థలం నుంచి పోలీసులు... ఓ 315 బోర్ రైఫిల్, ఒక మజిల్ లోడింగ్ రైఫిల్, రెండు పేలుడు పదార్థాలు, నక్సల్స్ క్యాంపింగ్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు