ఎర్రకోటలో 22 లక్షల కేజీల దుమ్ము

31 May, 2018 18:41 IST|Sakshi

న్యూఢిల్లీ : భారత చరిత్రలో ఎర్రకోటకు ఉన్న విశిష్టత గురించి అందరికి తెలిసిందే. స్వాతంత్ర్య దినోత్సవం రోజున దేశ ప్రధాని జాతీయ జెండా ఎగరేసేది ఇక్కడి నుంచే. అయితే పెరిగిపోతున్న కాలుష్యం వల్ల అటువంటి అద్భుత కట్టడాల ఉనికి ప్రశ్నార్ధకంగా మారుతుంది. దాదాపు నాలుగు శతాబ్దాల కిందట మెఘల్‌ చక్రవర్తి షాజహాన్‌ నిర్మించిన ఎర్రకోటని పరిరక్షించటానికి భారత పురావస్తు సర్వే విభాగం(ఏఎస్‌ఐ) నడుం బిగించింది. అందులో భాగంగా ఎర్రకోట పరిధిలో దుమ్మును తొలగించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. కేవలం ఐదు నెలల కాలంలోనే కోటకు ముప్పుగా పరిణమించిన 22 లక్షల కేజీల దుమ్ము, ధూళిని ఏఎస్‌ఐ తొలగించింది.

ఈ ఏడాది ప్రారంభంలో ఈ పక్రియను మొదలుపెట్టిన పురావస్తు శాఖ... గత వందేళ్ల నుంచి దాదాపు రెండు మీటర్ల మందంగా విస్తరించిన మట్టి పొరను తొలగించామని ఏఎస్‌ఐ డైరక్టర్‌ జనరల్‌ జె శర్మ తెలిపారు. నేలపై పేరుకుపోయిన దుమ్ము కట్టడానికి ప్రమాదకరంగా మారిందన్నారు. ఎర్రకోటకు వాస్తవ రూపాన్ని తెచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు. కోట లోపల మరుగుదొడ్లు, తాగునీరు వంటి వసతులు కల్పించడానికి ప్రయత్నిస్తున్నట్టు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు