మెట్రో స్టేషన్‌లో తప్పిన ప్రమాదం

3 Oct, 2019 16:53 IST|Sakshi

బెంగుళూరు : మెట్రో స్టేషన్‌లో ప్రయాణీకులకు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. గతంలో హైదరాబాద్‌లోని మెట్రో స్టేషన్‌లో పిల్లర్‌ పెచ్చు ఊడిపోయి ఓ మహిళ మరణించిన విషయం తెలిసిందే. తాజాగా బెంగళూరులోని ఓ మెట్రో స్టేషన్‌లో ప్రయాణికులకు కూడా ఇలాంటి సంఘటనే ఎదురైంది. వివరాల్లోకి వెళితే..నలుగురు ప్రయాణికులు స్టేషన్‌లోని ఆటోమెటిక్‌ ఫేర్‌ కలేక్షన్‌ గేటు వద్దకు రాగానే వారికి కొద్ది అడుగుల దూరంలో ఫాల్స్‌ సీలింగ్‌ నుంచి రెండు ప్యానల్‌లు ఊడిపడటంతో ఆందోళన చెందారు. కాగా ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. బెంగళూరులోని ‘నమ్మా మెట్రోస్‌ నేషనల్‌ కాలేజీ’ దగ్గరి మెట్రో స్టేషన్‌లో సెప్టెంబర్‌ 30న ఈ ఘటన చోటు చేసుకుంది.

అయితే సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జరిగినట్లుగా అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయిన ఫుటేజీలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. స్టేషన్‌ సైడ్‌ వాల్స్‌ లీకై గోడల నుంచి స్లాబ్‌లు పడిపోయిన ఘటనలు ఇంతకు ముందు కూడా చాలా జరిగాయని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైలు కదిలేటప్పుడు వచ్చే శబ్దానికి, వైబ్రేషన్స్‌కి ఇటుకలు వదులై పడిపోయింటాయని, అలాగే 70 సెంటీమీటర్ల మేర ఎతైన గోడలకు ప్లాస్టింగ్‌ చేయకపోవడం వల్లే ఇలా జరిగి ఉంటుందని.. త్వరలోనే గోడలకు ప్లాస్టింగ్‌ చేస్తామని బెంగళూరు మెట్రో రైలు కార్పోరేషన్‌(బీఎమ్‌ఆర్‌సీఎల్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ అజయ్‌సేత్‌ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు