సైనిక స్కూళ్ల ఏర్పాటుకు అంగీకారం!

6 May, 2016 19:52 IST|Sakshi

ఇటానగర్ః అరుణాచల్ ప్రదేశ్ లో రెండు సైనిక పాఠశాలలు సహా రెండు పర్మనెంట్ రిక్రూట్ మెంట్ సెంటర్ల  స్థాపనకు రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అంగీకరించారు. రాష్ట్రంలో రక్షణ దళాల నియామకాలను  మరింతగా పెంచేందుకు వీలుగా రిక్రూట్ మెంట్ సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

అరుణాచల్ ముఖ్యమంత్రి కలిఖో పుల్ ప్రతిపాదనను రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అంగీకరించారు. గురువారం రక్షణ మంత్రితో ఢిల్లీలో సమావేశమైన కలిఖో...  సైనిక పాఠశాలల స్థాపన విషయాన్ని ఓ అధికారిక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఆర్మీ స్టాఫ్ జనరల్ దల్బీర్ సింగ్ ను  కూడ ముఖ్యమంత్రి కలిఖో కలుసుకున్నారు. తాజా ప్రతిపాదన ప్రకారం ఒక పాఠశాలను పశ్చిమ ప్రాంతంలోని షెర్గాన్ లోనూ, మరొకటి తూర్పు ప్రాంతంలోని తెజు లోనూ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. అయితే పర్మనెంట్ రిక్రూట్ మెంట్ సెంటర్లను మాత్రం పశ్చిమ ప్రాంతంలోని తవాంగ్ లో ఒకటి, తూర్పు ప్రాంతంలోని తెజులో ఒకటి స్థాపించేందుకు రక్షణ మంత్రి అంగీకరించినట్లు తెలిపారు.

అంతేకాక, పౌర అవసరాల కోసం రక్షణ దళాలు వినియోగించే అత్యవసర హెలికాప్టర్ల విస్తరణను సులభతరం చేసేందుకు అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్ (ఏఎల్జీ) ఎంవోఏ ను కూడ పునరుద్ధరించేందుకు రక్షణమంత్రి పారికర్ అంగీకరించారు. అయితే బోర్డర్ రోడ్స్ అర్గనైజేషన్ ద్వారా  సరిహద్దు రోడ్ల నిర్మాణం, నిర్వహణ విషయాన్నికూడ కలిఖో పాల్ రక్షణమంత్రిని కోరినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు