అది బూటకపు ఎన్‌కౌంటర్‌

8 Dec, 2019 03:09 IST|Sakshi

సీబీఐ వంటి స్వతంత్ర సంస్థతో విచారణకు ఆదేశించండి 

సుప్రీంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు 

సాక్షి, న్యూఢిల్లీ: ‘దిశ’హత్య కేసులో నిందితులను కాల్చి చంపి ఎన్‌కౌంటర్‌గా చెబుతున్నారని, అది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని, ఈ ఘటనపై విచారణ జరిపించాలని సుప్రీం కోర్టులో ఇద్దరు సుప్రీం కోర్టు న్యాయవాదులు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపించాలని, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలకు ఆదేశించాలని పిటిషనర్లు జి.ఎస్‌.మణి, ప్రదీప్‌ కుమార్‌ యాదవ్‌ పిటిషన్లో కోరారు. ‘పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌(పీయూసీఎల్‌) వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర’కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన 16 మార్గదర్శకాలను అమలుచేయాల్సిందిగా ఆదేశించాలని విన్నవించారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ డీజీపీలతోపాటు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వి.సి.సజ్జనార్‌లను ప్రతివాదులుగా చేర్చారు.

సీబీఐ వంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని, లేదా ఇతర రాష్ట్రాలకు చెందిన పోలీస్‌ బృందంతో విచారణ జరిపించాలని విన్నవించారు. ‘పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌(పీయూసీఎల్‌) వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర’కేసులో జస్టిస్‌ ఆర్‌.ఎం.లోధా నేతృత్వంలోని ధర్మాసనం జారీచేసిన తీర్పులోని 16 మార్గదర్శకాలను పాటించాల్సిందేనని సుప్రీం కోర్టు ఆదేశించిందని ప్రస్తావించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏపీ సివిల్‌ లిబర్టీస్‌ కమిటీ(ఏపీసీఎల్సీ) కేసును కూడా ఈ పిటిషన్‌లో ఉదహరించారు. 2006లో నాటి మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి మాధవ్‌ అలియాస్‌ బుర్రా చెన్నయ్య సహా ఎనిమిది మంది నక్సలైట్లు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు.

ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ఫుల్‌ బెంచ్‌ విచారణ జరిపి ఫిబ్రవరి 6, 2009న తీర్పు ప్రకటించింది. ‘ఒక పోలీస్‌ అధికారి ఒక వ్యక్తి మరణానికి కారణమైతే, అధికార విధుల్లో భాగమైనప్పటికీ, ఆత్మరక్షణ కోసమైనప్పటికీ, సంబంధిత ఘటనకు దారితీసిన కారణాలను నిక్షిప్తం చేస్తూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి..’అని ఆ తీర్పులో పేర్కొంది. దీనిపై సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. విచారించి జూలై 18, 2019న సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ‘పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర’కేసులో జస్టిస్‌ లోధా ధర్మాసనం ఇచ్చిన తీర్పులో కూడా ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఇదే కోర్టు స్పష్టం చేసిందని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో గుర్తుచేసింది. ఆ తీర్పులోని 16 మార్గదర్శకాలు అన్ని సందర్భాల్లోనూ వర్తిస్తాయంది. సెక్షన్‌ 157 కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, ఇతర పోలీస్‌స్టేషన్‌ అధికారులతో దర్యాప్తు జరిపించి, ఆ నివేదికను కోర్టుకు సమర్పించాలని జస్టిస్‌ లోధా తీర్పు స్పష్టంచేసింది.  ఇలా సుప్రీం కోర్టు తీర్పును న్యాయవాదులు ప్రస్తావిస్తూ తాజాగా ‘దిశ’ కేసులోని నిందితుల ఎన్‌కౌంటర్‌కు బాధ్యులైన వారిపై విచారణకు ఆదేశించాలని సు్రíపీంకోర్టుకు నివేదించారు. 

మరిన్ని వార్తలు