వర్మ నివాసం వద్ద నలుగురు అనుమానితుల అరెస్ట్‌

25 Oct, 2018 09:56 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ ఉన్నతాధికారుల మధ్య విభేదాల నేపథ్యంలో సీబీఐ మాజీ చీఫ్‌ అలోక్‌ వర్మ నివాసం వద్ద అనుమానాస్పదంగా సంచిరిస్తున్న నలుగురు వ్యక్తులను గురువారం ఉదయం సెక్యూరిటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సీబీఐ మాజీ డైరెక్టర్‌ వర్మ, ప్రత్యేక డైరెక్టర్‌ రాకేష్‌ ఆస్ధానాలను సెలవుపై పంపిన మరుసటి రోజు ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. వీరు ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఐడీ కార్డులను ధరించి ఉన్నట్టు గుర్తించారు.

వర్మ నివాసం వద్ద అదుపులోకి తీసుకున్న అనుమానితులను ఢిల్లీ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వీరి గురించి ఇతర వివరాలను అధికారులు వెల్లడించలేదు. మరోవైపు వర్మపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన ఫైళ్లు, రికార్డులను సమర్పించేందుకు ఆయన సహకరించడంలేదని సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ) ఆరోపించింది.

కమిషన్‌ విధినిర్వహణను ఉద్దేశపూర్వకంగా వర్మ అడ్డుకున్నారని తేటతెల్లమైందని సీవీసీ స్పష్టం చేసింది. కాగా తనను ప్రభుత్వం సెలవుపై పంపడాన్ని సవాల్‌ చేస్తూ వర్మ సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ ఆస్ధానా దర్యాప్తు ఏజెన్సీ విచారణలకు ఆటంకాలు కల్పిస్తున్నారని వర్మ ఆరోపించారు.

మరిన్ని వార్తలు