మహిళా శక్తి @ చంద్రయాన్‌

23 Jul, 2019 06:11 IST|Sakshi
రీతూ కరిథల్‌, ఎం.వనిత

శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు ప్రయోగించిన చంద్రయాన్‌–2 ప్రాజెక్టులో 30 శాతం మంది మహిళా శాస్త్రవేత్తలు పనిచేస్తున్నట్టు సమాచారం. అంతరిక్ష శాస్త్ర విజ్ఞాన రంగం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో తామేమీ తక్కువ కాదన్నట్టుగా చంద్రయాన్‌–2 ప్రయోగంలో 30 శాతం మంది మహిళలు ఎంతో కృషి చేశారు. త్రీ–ఇన్‌–ఒన్‌గా భావిస్తున్న చంద్రయాన్‌–2 ప్రాజెక్టులో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్‌లు రూపొందించడంలో మహిళా శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేశారు.

అహ్మదాబాద్‌లోని స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్, బెంగళూరులోని ప్రొఫెసర్‌ యూఆర్‌ రావు శాటిలైట్‌ సెంటర్‌లో పని చేసి ల్యాండర్, రోవర్‌ను రూపొందించడంలో మహిళా శాస్త్రవేత్తల భాగస్వామ్యం కూడా ఉంది. ఇందులో కొంతమందిని మాత్రమే ఇక్కడ ఉదహరిస్తున్నాము.   భారతదేశానికి ఎంతో తలమానికంగా నిలిచే ఈ ప్రయోగంలో మహిళా శాస్త్రవేత్తల కృషి దాగి ఉండడం విశేషం. ఇస్రోలో 30 మంది మహిళా శాస్త్రవేత్తలు పనిచేస్తుండగా ఈ ప్రయోగంలో రీతూ కరిథల్‌ మిషన్‌ డైరెక్టర్‌గా, ఎం.వనిత ప్రాజెక్టు డైరెక్టర్‌గా అత్యంత కీలకంగా ఉన్నారు. బాలు శ్రీ దేశాయ్, డాక్టర్‌ సీత, కె.కల్పన, టెస్సీ థామస్, డాక్టర్‌ నేహ సటక్‌ అనే శాస్త్రవేత్తలు ఈ ప్రయోగంలో భాగస్వాములై మహిళాశక్తిని నిరూపించారు.

‘రాకెట్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఇండియా’ రీతూ..
చంద్రయాన్‌–2 మిషన్‌ డైరెక్టర్‌గా వ్యవహరించిన రీతూ కరిథల్‌ ‘‘రాకెట్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఇండియా’’గా ఇస్రోలో అందరూ పిలుస్తుంటారు. మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌ ప్రయోగంలో కూడా ఈమె డిప్యూటీ ఆపరేషన్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈమె 2007లో మాజీ రాష్ట్రపతి, అణుపరీక్షల నిపుణులు డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌కలాం చేతుల మీదుగా ఇస్రో యంగ్‌ సైంటిస్ట్‌ అవార్డును కూడా అందుకున్నారు. చంద్రయాన్‌–2 మిషన్‌లో అత్యంత కీలకమైన మహిళా శాస్త్రవేత్తగా అందరి మన్ననలను అందుకుంటున్నారు.

ఉపగ్రహాల తయారీలో దిట్ట..
చంద్రయాన్‌–2 ప్రాజెక్టుకు డైరెక్టర్‌గా పనిచేసిన ఎం.వనిత ఉపగ్రహాల రూపకల్పనలో నిపుణురాలు. ఆమె డిజైన్‌ ఇంజినీర్‌గా శిక్షణ తీసుకుని చంద్రయాన్‌–2 అత్యంత కీలకమైన మహిళా శాస్త్రవేత్తగా ఎంతో గుర్తింపు పొందారు. ‘‘ఆస్ట్రనామికల్‌ సొసైటీ అఫ్‌ ఇండియా ’’నుంచి 2006లో బెస్ట్‌ ఉమెన్‌ సైంటిస్టు అవార్డును అందుకున్నారు. చంద్రయాన్‌–2 మిషన్‌ బాధ్యతలన్నింటిని వనిత చూసుకుని ప్రయోగాన్ని విజయవంతం చేయడంలో కీలకమైన పాత్ర పోషించారు.

శాస్త్రవేత్తలకు అభినందనలు: గవర్నర్‌  
చంద్రయాన్‌–2 ప్రయోగం సక్సెస్‌ కావడంతో ఇస్రో శాస్త్రవేత్తల బృందానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ అభినందనలు తెలిపారు. భారతీయ అంతరిక్ష పరిశోధనల చరిత్రలో చంద్రయాన్‌2 మిషన్‌ భారీ ముందడుగు అని అన్నారు.  

గొప్ప ముందడుగు: ఏపీ సీఎం జగన్‌
చంద్రయాన్‌–2 ప్రయోగం విజయవంతం అయినందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలను అభినందించారు. అంతరిక్ష రంగంలో ఈ విజయం అతి గొప్ప ముందడుగు అని ప్రశంసించారు. ఈ విజయంతో భారత్‌ చంద్రునిపై ప్రయోగాలు చేస్తున్న దేశాల సరసన చేరిందని అన్నారు.  

సీఎం కేసీఆర్‌ అభినందనలు
చంద్రయాన్‌–2 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలకు తెలంగాణ సీఎం చంద్రశేఖర్‌ రావు అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగంలో భారతీయ శాస్త్రవేత్తల కఠోర శ్రమ, మేథా సంపత్తి దాగి ఉందని కొనియాడారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు