వారి కష్టాన్ని ఇంకెలా చెప్పాలి?

13 Jan, 2017 10:22 IST|Sakshi
ఇంతపెద్ద దేశంలో వారిని పట్టించుకోరా..?

బటేశ్వర్‌: రెండు చెక్క పడవలు ఆ రెండు గ్రామాలను ప్రపంచంతో కలుపుతున్నాయి. వాటి ద్వారానే వారి రాకపోకలు, అవసరాలు తీర్చుకోవడాలు. అది తప్ప వేరే మార్గం లేదు వారికి. నేతలకు కూడా వారి సమస్యలు అంతగా పట్టవు. ఓట్ల సమయంలో మాత్రం కాస్తంత హడావుడి చేస్తుంటారు. ఇదేదో వేరే ఏ దేశంలోని సమస్య కాదు.. మన భారత దేశంలోనిదే.. ఈ గ్రామాలు ఉంది కూడా మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి సొంతూరుకు సమీపంలోనే.. ఆగ్రాకు 72 కిలో మీటర్ల దూరంలో ఉంటాయివి.

వివరాల్లోకి వెళితే.. భర్తర్‌, కల్యాణ్‌పూర్‌ అనే రెండు గ్రామాలు బటేశ్వర్‌లోని ప్రముఖ శివాలయాలకు ఎదురుగా ఉంటాయి. కానీ, స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని దశాబ్దాలు అవుతున్నా.. అభివృద్ధి మంత్రం జపిస్తున్నా కూడా ఈ గ్రామాన్ని ప్రపంచానికి కలుపుతున్నది మాత్రం రెండు చెక్క బోట్లే. అక్కడ అభివృద్ధి కానరాదు. ఈ గ్రామం చుట్టూ యమునా నది ఉంటుంది. దీంతో వారికి ఇక వేరే గ్రామాలతో సంబంధాలు, ఆధునీకత, సాంకేతిక పరిజ్ఞానం అందుకునే అవకాశం లేదు. ఈ కారణంతోనే వారు గతంలో రెండు సార్లు ఎన్నికలు బహిష్కరించారు కూడా. అయినప్పటికీ వారి జీవితాల్లో ఎలాంటి మార్పు లేదు.

ఈ గ్రామంలో 15 నుంచి 75 ఏళ్ల మధ్య ఉన్నవాళ్లంతా బోటు నడపడం నేర్చుకున్న వాళ్లే. ఎందుకంటే వారిని నది దాటించే నైపుణ్యం ఉన్న పడవ నడిపే వాళ్లు లేరు. ఇక అత్యవసర పరిస్థితుల్లో అయితే మాత్రం వారిని ఆదుకునే నాథుడే ఉండడు. అక్కడ రెండు ప్రాథమిక పాఠశాలు ఉన్నాయిగానీ ఆరోగ్య కేంద్రాలు లేవు. ఈ రెండు గ్రామాల మొత్తం విస్తీర్ణం 750 హెక్కార్లు ఉంటుంది. ఇక్కడ మొత్తం జనాభా 2,400కాగా 1,600 మంది ఓట్లర్లుగా నమోదయ్యారు. ప్రతిసారి వచ్చి ప్రతిజ్ఞ చేసే నాయకులెవ్వరూ కూడా తమకోసం ఎలాంటి పనులు చేయలేదని వారు వాపోతున్నారు. తమ గ్రామం వద్ద దాదాపు 200 మీటర్లు ఉండే ఈ నదిపై ఒక వంతెన నిర్మించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంకో ఆశ్చర్యం ఏమిటంటే వారు విద్యుత్‌ వెలుగులను ఈ మధ్య కాలంలోనే చూశారంట.

మరిన్ని వార్తలు