జన్‌ధన్‌కు జై..

26 May, 2016 09:06 IST|Sakshi

సబ్‌కా సాథ్.. సబ్‌కా వికాస్.. దేశంలో ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఫలాలు అందిస్తామంటూ ఎన్నికల ప్రచార సమయంలో నరేంద్ర మోదీ ఇచ్చిన నినాదమిదీ! ప్రధానిగా అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ నినాదాన్ని నిజం చేసేందుకు ఆయన అనేక ప్రతిష్టాత్మక పథకాలు ప్రవేశపెట్టారు. స్వచ్ఛభారత్, జన్‌ధన్ యోజన, మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియాలతో పాటు బాలికల కోసం భేటీ బచావ్, భేటీ పడావ్, మహిళల సాధికారత కోసం ముద్ర యోజన, ఎస్సీ/ఎస్టీ ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు స్టాండప్ ఇండియా.. ఇలా దాదాపు 40 పథకాలు ప్రవేశపెట్టారు.

అయితే ఇందులో స్వచ్ఛ భారత్, జన్‌ధన్ యోజన పథకాలే ప్రజాదరణ పొందాయి. ఇటీవల సీఎంఎస్ సర్వేలో కూడా ఇదే తేలింది. ఇబ్బడిముబ్బడిగా పథకాలు ప్రవేశపెడుతున్నా వాటిలో(40 పథకాల్లో) 25 పథకాల గురించి తెలిసినవారు కేవలం 3 శాతమే ఉన్నారు. 25 శాతం మందికి ఏడు పథకాలు మాత్రమే తెలుసు. మోదీ ఇప్పటిదాకా ప్రవేశపెట్టిన పథకాలు, వాటి తీరుతెన్నులను ఓసారి చూద్దాం..- సెంట్రల్‌డెస్క్
 
 ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన

 కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ప్రజల నుంచి పెద్దఎత్తున స్పందన వచ్చిన పథకాల్లో ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన(పీఎంజేడీవై) ఒకటి. దేశంలో ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతా ఉండేలా చూడడం ఈ పథకం లక్ష్యం. జీరో బ్యాలెన్స్‌తో ఏ ప్రభుత్వ బ్యాంకులోనైనా ఖాతా తెరుచుకునే అవకాశం కల్పించే ఈ పథకాన్ని 2014 ఆగస్టు 28న మోదీ ప్రారంభించారు. పథకం ప్రారంభించిన ఐదు నెలల్లోనే దేశవ్యాప్తంగా ఏకంగా 15.59 కోట్ల ఖాతాలు తెరుచుకున్నాయి. ఇది గిన్నిస్ రికార్డు. ఇప్పటివరకు ఈ పథకం కింద 21.81 కోట్ల ఖాతాలున్నాయి. వాటిలో ఖాతాదారులు రూ.37,445 కోట్లు జమ చేసుకున్నారు. రూపాయి కార్డు ద్వారా 17 కోట్ల ఖాతాలిచ్చారు. ఈ పథకంతో గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా 61 శాతం మందికి బ్యాంకింగ్ సేవలు అందుతున్నాయి. వారిలో 52 శాతం మహిళలే ఉండడం విశేషం.
 
 స్వచ్ఛ భారత్ అభియాన్

 
పారిశుధ్యానికి పెద్దపీట వేస్తూ 2014 అక్టోబర్ 2న(గాంధీ జయంతి) రోజున ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం ఇది. ఈ పథకాన్ని ఒక సామాజిక ఉద్యమంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ప్రచారం నిర్వహించింది. దీంతో పారిశుధ్యంపై ప్రజల్లో గతంలో కంటే అవగాహన కాస్త పెరిగింది. 1986లో నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ కేంద్ర గ్రామీణ పారిశుధ్య పథకాన్ని ప్రారంభించారు. 1999లో వాజ్‌పేయి ప్రభుత్వం కూడా సంపూర్ణ పారిశుధ్య కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఇవేవీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేదు. స్వచ్ఛ భారత్ అభియాన్(ఎస్‌బీఏ) పథకం మాత్రం గణనీయమైన పురోగతి కనబరిచింది.

బహిరంగ మలవిసర్జన నిర్మూలించడం, రోడ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు తదితర చోట్ల చెత్తాచెదారం తొలగించడం, ప్రజాక్షేత్రాల్లో టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచడం ఈ పథకం ఉద్దేశం. 2019 అక్టోబర్ 2 నాటికి దేశవ్యాప్తంగా అన్ని కుటుంబాలకు.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో 100 శాతం మరుగుదొడ్లు(9 కోట్ల టాయిలెట్లు) నిర్మించడం పథకం లక్ష్యం. దేశంలోని 627 జిల్లాల్లోని అన్ని గ్రామాలనూ ఈ ప్రాజెక్టు పరిధిలోకి తీసుకొచ్చారు. బహిరంగ మల విసర్జనను నిర్మూలించేందుకు యూపీఏ ప్రభుత్వ హయాం చివర్లో (2013-14లో) 49,76,294 టాయిలెట్లను నిర్మిస్తే.. మోదీ ప్రభుత్వం 2014-15లో 58,55,666 టాయిలెట్లను నిర్మించింది. మొత్తంమీద ఇప్పటిదాకా ఒక్క గ్రామీణ ప్రాంతాల్లోనే కొత్తగా 2 కోట్ల మరుగుదొడ్లు నిర్మించింది. ఎస్‌బీఏ కింద 2.61 లక్షల ప్రభుత్వ బడుల్లో 4.17 లక్షల మరుగుదొడ్లు నిర్మించారు.
 
 ఇదీ ప్రగతి
 
 గ్రామీణ ప్రాంతాల్లో..
 *నిర్మించిన మరుగుదొడ్ల్లు - 2.07 కోట్లు
 *బహిరంగ మలవిసర్జనకు స్వస్తి పలికినవి - 14 జిల్లాలు, 190 బ్లాకులు, 23 వేల గ్రామ పంచాయతీలు, 56 వేల గ్రామాలు.

 పట్టణ ప్రాంతాల్లో..
 *నివాసాల్లో మరుగుదొడ్ల నిర్మాణం -15.10 లక్షలు
 *ఈ ఏడాది డిసెంబర్‌కల్లా బహిరంగ విసర్జన రహిత నగరాలు(లక్ష్యం)- 400 నగరాలు
 
 ఆధార్, డీబీటీతో అక్రమాలకు చెక్

 ఆధార్‌కు చట్టబద్ధత... మోదీ సర్కారు తీసుకున్న మరో కీలక నిర్ణయం! దీనిద్వారా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అసలైన లబ్ధిదారులకే అందడమే కాకుండా నగదు పక్కదారి పట్టడం చాలావరకు తగ్గిపోయింది. ప్రత్యక్ష నగదు బదిలీ పథకం, ఆధార్ చట్టబద్ధత ద్వారా ప్రజాపంపిణీ వ్యవస్థ(పీడీఎస్), ఎల్పీజీ, ఉపాధి హామీ పథకాల్లో అక్రమాలకు చెక్ పడింది. ఆధార్, డీబీటీ ద్వారా ఎల్పీజీలో 3.5 కోట్ల బోగస్ కనెక్షన్లను గుర్తించి తొలగించారు. దీంతో 2014-15లో రూ.14 వేల కోట్ల సొమ్ము ఆదా అయిందని ప్రభుత్వం చెబుతోంది.
 
 మేకిన్ ఇండియా
 పరిశ్రమలు భారత్‌లోనే తమ ఉత్పత్తులను తయారుచేసేలా ప్రోత్సహించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. 2014 సెప్టెంబర్ 25న ప్రధాని దీన్ని ప్రారంభించారు. మోదీ విదేశీ పర్యటనలకు వెళ్లిన ప్రతిచోటా ‘మేకిన్ ఇండియా’లో భాగంగా చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ పరిశ్రమలు, పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. ఈ పథకం కింద ఆటోమొబైల్స్, కెమికల్స్, ఐటీ, ఫార్మా, టెక్స్‌టైల్, పోర్టులు, రైల్వేలు, విమానయానం, పర్యాటకం, డిజైన్, మైనింగ్, బయోటెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ వంటి 25 ప్రధాన రంగాలపై ప్రభుత్వం దృష్టి సారించింది.
 
ఇదీ ప్రగతి..
*దేశంలో 2013-14లో -0.1 శాతంగా ఉన్న పారిశ్రామిక ఉత్పత్తి 2014-15 నాటికి 2.8 శాతం మేర పెరిగింది.
*ప్రపంచవ్యాప్తంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) తగ్గిపోతున్నా భారత్‌లో మాత్రం పెరిగాయి.
*భారత్‌లో పెరిగిన ఎఫ్‌డీఐల శాతం-48
*పెట్టుబడులకు ప్రపంచంలోనే అత్యుత్తమమైన దేశాల జాబితాలో భారత్ కిందటేడాది మొదటి స్థానంలో నిలిచింది.
 
 స్కిల్ ఇండియా
 ప్రపంచానికి భారత్ ‘మానవ వనరుల’ రాజధానిగా అవతరించాలన్న లక్ష్యంతో మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. యువతలో నైపుణ్యం పెంచి ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడం, తద్వారా పేదరికాన్ని తరిమివేయడం ఈ పథకం ఉద్దేశం. 2022నాటికి దేశంలో 40 కోట్ల మందికి వివిధ రంగాల్లో నైపుణ్యం కల్పించాలన్నది పథకం లక్ష్యం.
 
 ఇదీ ప్రగతి..
 *ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన కింద ఇప్పటివరకు 19.55 లక్షల మంది యువతకు శిక్షణ అందించారు.
 *దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్ యోజన ద్వారా 21 నగరాల్లో 1100 శిక్షణ కేంద్రాల ద్వారా 3.56 లక్షల మంది ట్రైనింగ్ ఇచ్చారు. వీరిలో 1.88 లక్షల మందికి ఉపాధి లభించింది.
*దేశంలో కొత్తగా 1,141 ఐటీఐలను నెలకొల్పి 1.73 లక్షల సీట్లను అందుబాటులోకి తెచ్చారు.
 *స్కిల్ లోన్ పథకం పేరిట బ్యాంకుల ద్వారా రూ.5 వేల నుంచి రూ.1.5 లక్షల రుణం అందిస్తున్నారు.
 
 ‘బీమా’ రక్షణ
 జనాన్ని బీమా ఛత్రం కిందకు తీసుకువచ్చేందుకు మోదీ ప్రభుత్వం 2015 మే 9న ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకాన్ని తెచ్చింది. సంవత్సరానికి కేవలం రూ.12 ప్రీమియంతో 18 నుంచి 70 ఏళ్లలోపు వారికి ఈ బీమా రక్షణ కల్పిస్తోంది. ప్రమాదవశాత్తూ మరణించినవారికి రూ.2 లక్షలు, ప్రమాదంలో అవయవాలు కోల్పోయినవారికి రూ.1 లక్ష అందిస్తారు. అలాగే సంవత్సరానికి రూ.330 ప్రీమియంతో రూ.2 లక్షల జీవిత బీమా కల్పించే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. పెన్షన్ సదుపాయాన్ని కల్పిచేందుకు అటల్ పెన్షన్ యోజన స్కీంను కూడా తెచ్చారు.
 
 ఇదీ ప్రగతి..
 * సురక్ష బీమా యోజన పథకంలో చేరిన వారి సంఖ్య 9.4 కోట్లు
 * జీవన్‌జ్యోతి పథకంలో చేరిన వారి సంఖ్య 3 కోట్లు
 * అటల్ పెన్షన్ యోజనలో చేరినవారు 20 లక్షలు

>
మరిన్ని వార్తలు