'విలక్షణ' రాజ్యాంగం!

26 Jan, 2019 04:12 IST|Sakshi

ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత విశిష్టతల్లో.. రాజ్యాంగం ప్రత్యేకమైనది. బ్రిటన్, అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా, జపాన్, ఐర్లాండ్, జర్మనీ, కెనడా దేశాల రాజ్యాంగాలను పరిశీలించి.. 308 మంది మేధావుల సుదీర్ఘ మేధోమథనం తర్వాత రాజ్యాంగాన్ని రూపొందించారు. ఇంగ్లీషు, హిందీ భాషల్లో చేతితో రాశారు. ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాం గం మనదే. దీంట్లో 444 అధికరణలు, 22 భాగాలు, 12 షెడ్యూళ్లు, 118 సవరణలున్నాయి. ఇంగ్లీషు రాజ్యాంగంలో 1,17,369 పదాలున్నాయి. రాజ్యాంగంలో కొన్ని సవరణలు చేయాలంటే పార్లమెం టులో మూడొంతుల ఆమోదం తప్పనిసరి. మరికొన్ని సవరణలకు పార్లమెంటులో మెజా రిటీతో పాటు సగం రాష్ట్రాలు కూడా ఆమోదించాల్సి ఉంటుంది.

కేంద్రం, రాష్ట్రాలు ద్వంద్వ పాలన విధానం మరో ప్రత్యేకత. మొదటిది సమాఖ్య లేదా కేంద్ర ప్రభుత్వం. రెండోది రాష్ట్ర ప్రభుత్వాలు. రాజ్యాంగం ఈ రెండింటికీ అధికారాలు పంచింది. అయితే, రాష్ట్రాలకంటే కేంద్రానికి ఎక్కువ అధికారాలు కట్టబెట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అధి కారాలన్నీ రాజ్యాంగం నుంచే దఖలు పడ్డాయి. భారత రాజ్యాంగం పౌరులందరికీ ఒకే పౌరసత్వం ఇచ్చింది.భారత దేశం గణతంత్ర రాజ్యం. ప్రజలకు, ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులకు విశేషాధికారాలు ఉంటే దాన్ని ‘గణతంత్రం’ అంటారు. రాజ్యాం గాన్ని విమర్శించే హక్కు పౌరులకు ఉంటడం మన రాజ్యాంగం కల్పించిన ప్రత్యేకత. మరే దేశ పౌరులకు ఈ హక్కు లేదు. రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కులు ప్రజలకు పెద్ద ఆస్తి. సమానత్వం, స్వేచ్ఛ, వాక్‌ స్వాతంత్య్రం, మత స్వేచ్ఛ, సాంస్కృతిక, విద్యా పరమైన స్వేచ్ఛ మొదలై నవి రాజ్యాంగం మనకిచ్చిన వరాలు. చాలా దేశాల్లో పౌరులకు ఇలాంటి హక్కులు లేవు.

రాజ్యాంగ పీఠిక చెబుతున్నదిదే! 
భారత ప్రజలమైన మేము.. ‘భారతదేశాన్ని సర్వసత్తాక– సామ్యవాద – లౌకిక – ప్రజాస్వామిక – గణతంత్ర రాజ్యంగా నిర్మించుకునేందుకు..  పౌరులందరికీ సాంఘిక – ఆర్థిక – రాజకీయ న్యాయాన్ని.. ఆలోచన – భావ ప్రకటన – విశ్వాసం – ధర్మం – ఆరాధనలపై స్వేచ్ఛను.. అంతస్తుల్లో – అవకాశాల్లో సమానత్వాన్ని చేకూర్చుకునేందుకు.. వారి వ్యక్తిగత గౌరవాన్ని, జాతీయ ఐక్యత, సమగ్రతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు..’ 

రాజ్యాంగ పీఠికలోని పై వాక్కులు భారత రాజ్యాంగ మూలతత్వాన్ని ప్రతిబింబిస్తు న్నా యి. రాజ్యాంగ లక్ష్యాలను మరింత మెరుగ్గా అర్థం చేసుకునేందుకు ఇవి దోహదపడతాయి. ఈ పీఠికే రాజ్యాంగానికి ఆత్మ. పీఠికలో భారతదేశాన్ని సర్వసత్తాక, ప్రజాస్వామిక, గణతంత్ర రాజ్యంగానే పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో (1976లో) 42వ రాజ్యాంగ సవరణ ద్వారా వీటికి.. ‘సామ్యవాద’, ‘లౌకిక’పదాలు చేర్చారు. ‘దేశ ఐక్యత’అనే పదాన్ని, ‘దేశ ఐక్యత, సమగ్రత’గా మార్చారు. సార్వభౌమాధికారానికి పెద్ద పీట వేయడం ద్వారా భారతదేశం సర్వ స్వతంత్రమైనదని పీఠిక పేర్కొంది.

తన విధానాల విషయంలో రాజీలేని వైఖరి అవలంభించగలదని స్పష్టీకృతమైంది. ప్రజాస్వామ్యమార్గాల్లో ‘సామ్యవాద’లక్ష్యాలు సాధిం చాలనే ఆలోచనకు దేశం కట్టుబడుతుందని తేల్చింది. ‘లౌకిక’తత్వానికి లోబడడం ద్వారా మత ప్రమేయం లేని రాజ్యంగా ప్రకటించుకుంది. ఓటు హక్కు ద్వారా తమ ప్రతినిధులను ఎన్నుకునేందుకు, ఎన్నికల్లో పోటీ చేసేందుకు, పాలనా వ్యవహారాల్లో భాగమయ్యేందుకు కావ లసిన ‘ప్రజాస్వామిక’హక్కులను కట్టబెట్టింది. రాచరికానికి స్థానం లేదని, ప్రజలు మాత్రమే పాలిస్తారని (గణతంత్రం) ప్రకటించింది.  

మరిన్ని వార్తలు