విమాన ప్రయాణికులకు శుభవార్త

22 Oct, 2016 07:49 IST|Sakshi
విమాన ప్రయాణికులకు శుభవార్త
స్వదేశీ విమాన ప్రయాణికులకు శుభవార్త. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న ఉడాన్ పథకం ప్రారంభమైంది. గంటలోపు ప్రయాణాలలో విమానంలోని సగం సీట్లకు రూ. 2,500 మాత్రమే వసూలు చేయాలన్న నిబంధన అమలులోకి వచ్చింది. వినియోగదారుల ధరల సూచికి అనుగుణంగా విమాన టికెట్ల ధరలను కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటారు. ప్రధాన రూట్లలో ప్రతి డిపార్చర్ మీద చిన్నమొత్తంలో లెవీ విధించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని మాత్రం విమానయాన సంస్థలు అంత తేలిగ్గా జీర్ణించుకునే పరిస్థితి లేదు. దానివల్ల విమానచార్జీలు పెంచాల్సి ఉంటుందని అంటున్నాయి. అయితే లెవీ ఎంత అన్నది ఇంకా నిర్ణయించలేదు. రాబోయే రోజుల్లో దీన్ని నిర్ణయిస్తారు. 
 
ప్రపంచంలోనే ఇలాంటి పథకం ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ - దేశంలో సామాన్యులు కూడా విమానం ఎక్కాలి౦ అనే పథకాన్ని మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించారు. విమానంలో కనీసం సగం సీట్లకు బిడ్డింగ్ వేయడంతో పాటు మిగిలిన వాటి ధరలు మార్కెట్ ఆధారంగా ఉండాలన్నది ఈ పథకం ఉద్దేశం. త్వరలోనే హెలికాప్టర్ సేవలు కూడా ఈ పథకం పరిధిలోకి వస్తాయి. ఈ పథకంలోని మొదటి విమానం జనవరిలో టేకాఫ్ తీసుకుంటుందని అంటున్నారు. 
 
ఈ పథకం గురించి చాలా జాగ్రత్తగా అన్నీ గమనిస్తున్నట్లు పౌర విమానయాన వాఖ మంత్రి అశోక్ గజపతిరాజు చెప్పారు. ఇప్పటివరకు విమానాలు అసలు నడపని లేదా తక్కువగా నడుపుతున్న నగరాలకు కూడా విమానాలు పంపాలన్నది తమ ఉద్దేశమన్నారు. 476-500 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసే విమానాల్లో సగం సీట్ల గరిష్ఠ ధరను రూ. 2,500గా ఉంచుతామని చెప్పారు. హెలికాప్టర్లలో అరగంట ప్రయాణానికి రూ. 2,500, గంట ప్రయాణానికి రూ. 5వేల చొప్పున గరిష్ఠ ధరలుంటాయి. 
మరిన్ని వార్తలు