యూజీసీని రద్దు చేయండి

1 Apr, 2015 12:44 IST|Sakshi

న్యూఢిల్లీ: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)ని రద్దు చేయాలని మానవవనరుల అభివృద్ధిశాఖ ప్యానెల్ సూచించింది. రద్దు చేయలేకపోతే మరింత మెరుగుపరచాలని కూడా పేర్కింది. ఆచరణకు అనుకూలమైనవే అయినప్పటికీ తన విధులు నిర్వహించడంలో, అప్పగించిన బాధ్యతలను పూర్తిచేయడంలో యూజీసీ విఫలమైందని వెల్లడించింది. వెంటనే జాతీయ ఉన్నత విద్యా సంస్థ ద్వారా యూజీసీని తీసేయాలని సూచించింది. ఒకవేళ అలా రద్దు చేయడం వీలుకాకుంటే అది పనిచేసే విధానాన్ని మరింత మెరుగుపరచాలని సదరు ప్యానెల్ సూచించింది.

గత ఆరు నెలల కిందట యూజీసీ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించాల్సిందిగా స్మృతి ఇరానీ ఆధ్వర్యంలోని మానవ వనరుల అభివృద్ధిశాఖ ఒక కమిటీని వేసింది. ఇది యూజీసీ పూర్తిగా విఫలమైందని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. అంతే కాకుండా యూజీసీ చైర్మన్ తప్పనిసరిగా అన్ని రాష్ట్రాలకు వెళ్లి విశ్వవిద్యాలయాల పనితీరును నేరుగా తెలుసుకోవాలని, కార్యాలయానికి పరిమితం కాకుడదని కూడా సూచించినట్లు సమాచారం. అయితే, ఈ నివేదికను ఇంకా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ వద్దకు తీసుకెళ్లలేదు. త్వరలోనే దీనిపై చర్చించనున్నారు.

మరిన్ని వార్తలు