అవాస్తవ కథనాలపై లీగల్‌ చర్యలు

25 Mar, 2018 12:11 IST|Sakshi

ఆధార్‌ డేటా గోప్యతపై యూఐడీఏఐ వార్నింగ్‌

సాక్షి, న్యూఢిల్లీ : ఆధార్‌ గోప్యత విషయంలో మీడియాల్లో వస్తున్న కథనాలపై యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) స్పందించింది. అసత్య కథనాలను, అవాస్తవాలను ప్రసారం చేసినా, ప్రచురించినా న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 

జెడ్‌డీ నెట్‌ అనే వ్యాపార సంబంధిత వెబ్‌సైట్‌.. ఆధార్‌ వ్యవస్థలో లోపాలు ఉన్నాయంటూ ఓ కథనాన్ని ప్రచురించింది. ఆధార్‌ వ్యవస్థ పటిష్టంగా లేదని.. వినియోగదారుల వ్యక్తిగత విషయాలతోపాటు బ్యాంక్‌ వివరాలను కూడా సులువుగా బుట్టదాఖలు చేసే పద్ధతులు ఉన్నాయని.. అందుకు ప్రభుత్వ కార్యాలయాల్లోని కంప్యూటర్లు సరిపోతాయంటూ పేర్కొంది. గతంలో ఇలాంటి వ్యవహారాలు(ఏజెంట్ల యూజ‌ర్ ఐడీ, పాస్ వ‌ర్డ్‌ల ద్వారా, ప్రభుత్వ కార్యాలయాల ద్వారా లీక్‌ కావటం) వెలుగులోకి వచ్చినప్పుడు వాటిని సరిచేసినట్లు ప్రభుత్వం ప్రకటించిందని.. కానీ, ఇప్పటికీ అది ఆగలేదని జెడ్‌డీ నెట్‌ కథనం తెలిపింది. 

దీనిపై యూఐడీఏఐ స్పందించింది. ఆధార్‌ గోప్యతపై ఆధారాలు లేకుండా కథనాలు ప్రచురిస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆధార్ సమాచారం అత్యంత సురక్షితంగా ఉందని.. సూపర్ కంప్యూటర్ నుంచి ఆధార్ సమాచారాన్ని తస్కరించాలంటే వందల కోట్ల సంవత్సరాలకు పైగా పడుతుందని పేర్కొంది. కాగా, ఆధార్‌ డేటా భద్రతపై సుప్రీం కోర్టులో ప్రజంటేషన్‌ ఇచ్చిన యూఐడీఏఐ  2048-ఎన్‌క్రిప్షన్ కీ సిస్టమ్‌లో భద్రంగా ఉన్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు