బయటికొస్తే కాల్చిపడేస్తా

27 Mar, 2020 14:17 IST|Sakshi
లాక్‌డౌన్‌ సందర్భంగా స్థానికులను హెచ్చరిస్తున్న మధ్యప్రదేశ్‌ పోలీసులు. సంజయ్‌ వర్మ(ఇన్‌సెట్‌)

ఉజ్జెయిన్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో కొంత మంది పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. దురుసుగా ప్రవర్తిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జెయిన్‌లో వీరంగం సృష్టించిన పోలీసు అధికారిపై సస్పెన్షన్‌ వేటు పడింది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లఘించి బయటకు వస్తే కాల్చి చంపుతానని మహిద్‌పూర్‌ స్టేషన్‌ హౌస్‌ అధికారి(ఎస్‌హెచ్‌ఓ) సంజయ్‌ వర్మపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఆయనను పోలీసు లైన్‌ను అటాచ్‌ చేస్తూ ఉజ్జెయిన్‌ ఎస్పీ సచిన్‌ అతుల్‌కర్‌ ఆదేశించారు.

‘నా మాట విని మీరంతా ఇళ్లలోనే ఉండండి. నా మాటలు బేఖతరు చేసి బయటకు వస్తే కాల్చి చంపుతాం. నేను షార్ప్‌ షూటర్‌ని. తుపాకితో గురి చూసి కాల్చడానికి నాకు ఏడు సెక్షన్లకు మించి సమయం పట్టదు’ అంటూ తన పర్సనల్‌ మొబైల్‌ నంబర్‌ నుంచి వాట్సప్‌లో సంజయ్‌ వర్మ హెచ్చరించారు. షూటింగ్‌లో తాను రజత పతకం గెలుచుకున్నానని, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని స్థానికులను తీవ్రంగా హెచ్చరిస్తూ మరో మెసేజ్‌ పెట్టారు. అంతేకాదు తన సందేశాన్ని వాట్సప్‌ గ్రూపుల్లో ఫార్వార్డ్‌ చేయాలని సూచించారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఆయనపై చర్య తీసుకున్నారు. ఇండోర్‌లో గురువారం 65 ఏళ్ల వ్యక్తి మృతి చెందడంతో మధ్య‍ప్రదేశ్‌లో కరోనా మరణాల సంఖ్య రెండుకు చేరింది. (క్షమాపణ చెప్పిన యూపీ పోలీసులు)

మరిన్ని వార్తలు