‘ప్రగతిశీల సానుకూల భారత బడ్జెట్‌’

2 Feb, 2018 04:25 IST|Sakshi
హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

న్యూఢిల్లీ: 2018–19 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం ‘ప్రగతిశీల, సానుకూల భారత్‌’బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రశంసించారు. గ్రామీణ, పట్టణ భారతాల మధ్య ఉన్న అంతరాన్ని రూపుమాపేందుకు ఈ బడ్జెట్‌ దోహదం చేస్తుందని తెలిపారు. ‘ప్రగతిశీల, సానుకూల భారతం కోసం దోహదం చేసే బడ్జెట్‌ ఇది. ఈసారి బడ్జెట్‌లో ప్రభుత్వ ప్రాధమ్యాలు మారాయి. ఇది దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అంతరాన్ని తగ్గించడానికి దోహదం చేస్తుంది. సరికొత్త భారతం కోసం చారిత్రక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి జైట్లీకి అభినందనలు.

ప్రధాన మంత్రి ఉజ్వల్‌ యోజన పరిధిలోకి 8 కోట్ల కుటుంబాలను తీసుకురావడం.. సాధారణ ప్రజల జీవితాలను మరింత మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నిరూపిస్తోంది. గత కొన్నేళ్లలో వచ్చిన బడ్జెట్లలో రైతులు, ప్రజలకు అత్యంత అనుకూలంగా ఉన్న బడ్జెట్లలో ఇదొకటి. ప్రతి పేద, బలహీన కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున 10 కోట్ల కుటుంబాలకు ఆరోగ్యభీమా కల్పించడం ఆరోగ్యరంగంలో తీసుకొచ్చిన గొప్ప మార్పు. ప్రభుత్వం తీసుకురానున్న ఆపరేషన్‌ గ్రీన్‌ పథకంతో అద్భుతమైన వ్యవసాయాభివృద్ధి సాధ్యమవుతుంది. తద్వారా 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకోగలం’అని రాజ్‌నాథ్‌ వెల్లడించారు. 

మరిన్ని వార్తలు