దక్షిణ భారత్‌ నుంచి విమానాలు: బ్రిటన్‌

10 Apr, 2020 13:53 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో భారత్‌లో చిక్కుపోయిన తమ దేశ​స్థులను స్వదేశానికి బ్రిటన్‌ తరలిస్తోంది. ప్రత్యేక విమానాల ద్వారా తమ పౌరులను ఇక్కడి నుంచి తీసుకెళుతోంది. ఇందులో భాగంగా బుధవారం అర్ధరాత్రి శిశువుతో పాటు 316 మంది ప్రయాణికులతో కూడిన విమానాలు గోవా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి లండన్‌ చేరుకున్నాయి.

దక్షిణ భారత్‌ సహా దేశంలోని మిగతా ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని కూడా తీసుకెళతామని భారత్‌లోని బ్రిటీషు తాత్కాలిక డిప్యూటీ కమిషనర్‌ పాల్‌ కార్టర్‌ తెలిపారు. ఇందుకోసం హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, కొచ్చి, త్రివేండ్రం నుంచి అదనంగా చార్టర్‌ విమానాలను నడుపుతామని ఆయన వెల్లడించారు. 3 వేల మందిపైగా తమ పౌరులు ఇక్కడ నిలిచిపోయారని, 12 ప్రత్యేక విమానాల్లో వారిని తరలిస్తామన్నారు. ఈ విమానాల్లో టిక్కెట్లను నేటి నుంచి బుక్‌ చేసుకోవచ్చని ‘ఏఎన్‌ఐ’తో చెప్పారు. 

అయితే భారత్‌ నుంచి అధికారికంగా ఎటువంటి విమానాలు నడపడం​ లేదు. ఇక్కడ చిక్కుకుపోయిన వివిధ దేశాల పౌరులను తీసుకెళ్లేందుకు మాత్రమే ఆయా దేశాల విమానాలను భారత్‌ అనుమతిస్తోంది. కరోనా నివారణలో ఉపయోగించే వైద్య పరికరాలు, ఔషధాల ఎగుమతులు- దిగుమతులకు ప్రత్యేక అనుమతితో కేంద్ర ప్రభుత్వం విమానాలు నడుపుతోంది. ఏప్రిల్‌ 30 వరకు టిక్కెట్‌ అడ్వాన్స్‌ బుకింగ్‌ అనుమతించబోమని ఎయిర్‌ ఇండియా ప్రకటించిన సంగతి తెలిసిందే. 

చదవండి: కరోనా కాలం: చెట్టుపైనే మకాం! 

>
మరిన్ని వార్తలు