భారత్‌లో స్కోర్‌తో యూకే వర్సిటీలో సీటు

1 Dec, 2019 05:03 IST|Sakshi

ప్రతిభ కలిగిన విద్యార్థుల కోసం బెల్‌ఫాస్ట్‌ యూనివర్సిటీ అన్వేషణ

న్యూఢిల్లీ: భారత్‌లో జరుగుతున్న వివిధ ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశం కోసం జరిగే పరీక్షల నాణ్యతా ప్రమాణాల్ని బ్రిటన్‌కు చెందిన బెల్‌ఫాస్ట్‌ యూనివర్సిటీ పరిశీలిస్తోంది. తమ యూనివర్సిటీ అడ్మిషన్ల ప్రమాణాలకు లోబడి భారత్‌లో ఏయే యూనివర్సిటీల ఎంట్రన్స్‌ పరీక్ష స్కోర్లు ఉంటాయో అన్వేషిస్తున్నామని బెల్‌ఫాస్ట్‌ వైస్‌ చాన్స్‌లర్‌ ఇయాన్‌ గ్రీర్‌ చెప్పారు. భారత్‌లో జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌(జేఈఈ)లో విద్యార్థులు సాధించిన స్కోర్లనే తమ వర్సిటీలో ప్రవేశ పరీక్షకు అర్హతగా పరిగణిస్తామని గతంలో యూనివర్సిటీ ప్రకటించింది. ఇతర ఎంట్రన్స్‌ పరీక్షల నాణ్యతను పరిశీలించడానికి ఇప్పుడు సిద్ధమైంది.

‘ప్రతిభగల విద్యార్థుల్ని ఆకర్షించడం కోసం భారత్‌లో విశ్వసనీయత కలిగిన ఎంట్రన్స్‌ పరీక్షల్లో వచ్చే స్కోర్లు తమ వర్సిటీకి ఎంతవరకు పనికి వస్తాయో పరీక్షించి చూస్తున్నాం. అలాగని మేము ఏ యూనివర్సిటీని తగ్గించి చూడటం లేదు. మా యూనివర్సిటీ ప్రమాణాలకు సరితూగే ఎంట్రన్స్‌ పరీక్షల స్కోర్ల కోసం చూస్తున్నాం’’అని చెప్పారు. యూకే ప్రభుత్వం భారత్‌ విద్యార్థులకు పోస్ట్‌ స్టడీ వర్క్‌ వీసా నిబంధనల్ని సరళీకృతం చేయడంవల్ల ప్రతిభ కలిగిన విద్యార్థులకు, యూకేకి మంచే జరుగుతుందని వీసీ చెప్పారు. భారత్‌లో నాణ్యతా ప్రమాణాలు కలిగిన యూనివర్సిటీలను గుర్తించడానికి ఇక్కడ కొన్ని సంస్థల్ని భాగస్వాములుగా చేసుకొని అన్వేషణ కొనసాగిస్తున్నట్టు గ్రీర్‌ వెల్లడించారు.

మరిన్ని వార్తలు