నేటి నుంచి ఢిల్లీలో అల్ట్రా క్లీన్‌ పెట్రోల్‌

1 Apr, 2018 02:20 IST|Sakshi

జనవరి 1 నుంచి హైదరాబాద్‌లోనూ..

న్యూఢిల్లీ: ఢిల్లీలోని అన్ని పెట్రోల్‌ బంకుల్లో అల్ట్రా క్లీన్‌ యూరో–6 గ్రేడ్‌ పెట్రోల్, డీజిల్‌ను ఆదివారం (ఏప్రిల్‌ 1) నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు. దేశ రాజధానిలో పెరిగిన వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు గాను ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అల్ట్రా క్లీన్‌ పెట్రోల్‌ను సాధారణ ధరలకే విక్రయించనున్నారు. నేషనల్‌ కేపిటల్‌ రీజియన్‌ (ఎన్‌సీఆర్‌) పరిధిలోని నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్, ఫరీదాబాద్‌తోపాటు ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ లాంటి 13 పెద్ద నగరాల్లో వచ్చే ఏడాది జనవరి 1 నుంచి, దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో 2020 ఏప్రిల్‌ నుంచి అల్ట్రా క్లీన్‌ ఇంధనం అందుబాటులోకి రానుంది.

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బీవీ రమ గోపాల్‌ మాట్లాడుతూ.. బీఎస్‌–6 (యూరో–6కు సరిసమానమైన) పెట్రోల్‌ను రాష్ట్రంలోని 391 బంకుల్లో విక్రయించనున్నట్లు వెల్లడించారు. అల్ట్రా క్లీన్‌ కోసం సాధారణ పెట్రోల్‌ కంటే 50 పైసలు ఎక్కువగా కంపెనీలు ఖర్చు చేయాల్సి వస్తోందని, వినియోగదారులపై ఇప్పటికిప్పుడు ఆ భారం మోపే ఉద్దేశం లేదని చెప్పారు. ఢిల్లీలో ఏడాదికి 9.6 లక్షల టన్నుల పెట్రోల్, 12.65 లక్షల టన్నుల డీజిల్‌ వినియోగమవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని మథుర, హర్యానాలోని పానిపట్, మధ్యప్రదేశ్‌లోని బినా, పంజాబ్‌లోని భటిండా రిఫైనరీలు ఇప్పటికే యూరో–6 పెట్రోల్‌ ఉత్పత్తిని ప్రారంభించాయి.

మరిన్ని వార్తలు