జేఎన్‌యూ విద్యార్థి నేత ఉమర్‌ ఖలీద్‌పై దాడి

14 Aug, 2018 03:34 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) విద్యార్థి సంఘం నేత ఉమర్‌ ఖలీద్‌పై సోమవారం ఢిల్లీలో హత్యాయత్నం జరిగింది. కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఖలీద్‌పై గుర్తుతెలియని దుండగుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. తర్వాత అక్కడ్నుంచి పరారయ్యాడు. ఈ దాడిలో ఖలీద్‌కు ఎలాంటి గాయాలు కాలేదు.  యునైటెడ్‌ అగినెస్ట్‌ హేట్‌ సంస్థ సోమవారం మూకహత్యలకు వ్యతిరేకంగా ఖౌఫ్‌ సే ఆజాదీ(భయం నుంచి విముక్తి)పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి సుప్రీంకోర్టు లాయర్‌ ప్రశాంత్‌ భూషణ్, ప్రొఫెసర్‌ అపూర్వానంద్, రోహిత్‌ వేముల తల్లి రాధిక, ఖలీద్‌ హాజరయ్యారు. కాల్పుల ఘటనపై ఖలీద్‌ స్పందిస్తూ.. ‘మధ్యాహ్నం 2.30 గంటలకు బయట టీ తాగి సమావేశం దగ్గరకు తిరిగివస్తున్నాను. ఇంతలో వెనుక నుంచి బలంగా తోసేశారు. నేను కిందపడగానే తుపాకీ తీసి కాల్చేందుకు ప్రయత్నించాడు. దీంతో నేను అక్కడ్నుంచి పరిగెత్తా. చివరికి అతను ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు’ అని తెలిపారు. 

మరిన్ని వార్తలు