స్టెరిలైట్‌ ప్లాంట్‌ మూసివేతపై సందేహాలు

29 May, 2018 18:38 IST|Sakshi
తూత్తుకుడి స్టెరిలైట్‌ ప్లాంట్‌ (ఫైల్‌ఫోటో)

సాక్షి, చెన్నై : ప్రజాందోళనలకు తలొగ్గి తూత్తుకుడి స్టెరిలైట్‌ ప్లాంట్‌ మూసివేతపై తమిళనాడు ప్రభుత్వం చేసిన ప్రకటనపై పలు సందేహాలు ముందుకొస్తున్నాయి. స్దానికుల హింసాత్మక నిరసనల్లో 13 మంది మరణించడం, పెద్దసంఖ్యలో నిరసనకారులు గాయపడటంతో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినా న్యాయపరమైన చిక్కులు సహా సరైన కసరత్తు జరపకుండానే ప్రభుత్వం ప్రకటన చేసిందని భావిస్తున్నారు.   ప్లాంట్‌ కార్యకలాపాలు నిలిచిపోవడంతో ప్లాంట్‌పై ఆధారపడి జీవిస్తున్న వేలాది కుటుంబాలకు ప్రత్యామ్నాయం చూపడం పెనుసవాలే.

ప్రభుత్వం నిర్ణయంపై తదుపరి చర్యలు చేపట్టేముందు స్టెరిలైట్‌ యూనిట్‌ ప్రమోటర్‌ వేదాంత స్పందించిన తీరు పలు ప్రశ్నలు ముందుకుతెస్తోంది. ప్లాంట్‌ మూసివేతకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం న్యాయపరమైన ప్రక్రియను అనుసరించలేదని కంపెనీ చెబుతోంది. తమకు ఎలాంటి షోకాజ్‌ నోటీసు జారీ చేయలేదని, యూనిట్‌ మూసివేతకు తమకు తగినంత సమయం ఇవ్వలేదని స్టెరిలైట్‌ వాదిస్తోంది.

స్టెరిలైట్‌ యూనిట్‌ మూసివేతపై మే 23న తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు తొందరపాటుతో కూడుకున్నవని విదుదలై చిరుతైగల్‌ కచ్చి సభ్యులు డీ రవికుమార్‌ చెబుతున్నారు. ఈ ఉత్తర్వుల్లో తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి యూనిట్‌ మూసివేతకు ఎలాంటి సహేతుక కారణం చూపలేదని, దీనిపై న్యాయస్ధానాలు సులభంగా స్టే ఉత్తర్వులు జారీ చేస్తాయని అభిప్రాయపడ్డారు.

నిరసనకారుల ఆందోళనను దారిమళ్లించి, స్టెరిలైట్‌కు స్టే తెచ్చుకునేందుకు వీలుగా చేపట్టిన కుట్రలో ఇది భాగమని అభివర్ణించారు. స్టెరిలైట్‌ ప్లాంట్‌ చుట్టూ వివాదాలు ముసురుకున్న నేపథ్యంలో ప్లాంట్‌పై ఆధారపడిన 5000 మంది ఉద్యోగులు మాత్రం తమ భవితవ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు