‘మార్గదర్శి’ కేసులో హైకోర్టు తీర్పుపై అప్పీల్‌

18 Dec, 2019 02:37 IST|Sakshi

సుప్రీంకోర్టులో మాజీ ఎంపీ ఉండవల్లి స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌

ఈ కేసులో రెండు రాష్ట్ర ప్రభుత్వాలను భాగస్వాములను చేయాలని విజ్ఞప్తి

సాక్షి, న్యూఢిల్లీ: మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ కేసులో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తమపై ఉన్న క్రిమినల్‌ కంప్లయింట్‌ (సీసీ) నెంబర్‌ 540ని కొట్టివేయాలని మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ సంస్థ క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసిందని, దీనిని ఉమ్మడి హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం విచారించి సీసీ 540ని కొట్టివేసిందని పిటిషన్‌లో వివరించారు. దీనిపై సుప్రీంకోర్టులో అప్పీలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి లేఖ కూడా రాసినట్టు పేర్కొన్నారు. అలాగే ఈ కేసులో అప్పీలు చేసేందుకు తనకు అనుమతి ఇవ్వాలని ఒక అప్లికేషన్‌ దాఖలు చేయడంతోపాటు హైకోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ ఆయన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేశారు.

ఉమ్మడి హైకోర్టు విభజనకు ఒకరోజు ముందు 2018 డిసెంబరు 31న ఈ తీర్పు వెలువడిందని పిటిషన్‌లో పేర్కొన్న ఉండవల్లి.. ఈ కేసులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలను భాగస్వాములను చేయాలని మరో అప్లికేషన్‌ దాఖలు చేశారు. అవిభక్త హిందూ కుటుంబ సంస్థ(హెచ్‌యూఎఫ్‌) అయిన మార్గదర్శి ఫైనాన్షియర్స్‌.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చట్టం–1934లోని సెక్షన్‌ 45(ఎస్‌) నిబంధనను ఉల్లంఘించి డిపాజిట్లు వసూలు చేయగా, ఉమ్మడి హైకోర్టు ఈ చట్టంలోని సెక్షన్‌ 45(ఎస్‌)ను తప్పుగా అన్వయించిందని, ‘అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండివిడ్యువల్స్‌’పరిధిలోకి హెచ్‌యూఎఫ్‌ రాదని, ఈ నేపథ్యంలో సెక్షన్‌ 45ఎస్‌(2) పరిధిలోకి తేవొద్దని చెబుతూ క్రిమినల్‌ కంప్లయింట్‌ను కొట్టేసిందని పిటిషన్‌లో వివరించారు.

అయితే అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 2006 నవంబర్‌లో రాసిన లేఖకు 2007 జూన్‌ 2న ఆర్‌బీఐ బదులిస్తూ.. ప్రతివాది చాప్టర్‌ 3బి కింద అర్హత కలిగి లేడని, సెక్షన్‌ 45ఎస్‌ కింద లావాదేవీలు జరిపేందుకు వీలులేదని స్పష్టం చేసిందని పేర్కొన్నారు. పైగా సంబంధిత అంశాలపై సుప్రీంకోర్టులో సివిల్‌ అప్పీళ్లు పెండింగ్‌లో ఉండగా.. క్రిమినల్‌ కంప్లయింట్‌ను కొట్టివేయడంతో ఆ అప్పీళ్లన్నీ ఫలితం లేనివిగా మారిపోయాయని నివేదించారు.

ఇదీ నేపథ్యం..
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చట్టం–1934లోని సెక్షన్‌ 45(ఎస్‌) నిబంధనను ఉల్లంఘించి, దాదాపు రూ.2300 కోట్ల మేర డిపాజిట్లను సేకరించిందన్న అభియోగంపై ఇదే చట్టంలోని సెక్షన్‌ 45(టి), సెక్షన్‌ 58(ఇ) ఆధారంగా మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై చర్యలు తీసుకునేందుకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2006 డిసెంబర్‌ 19న ఉత్తర్వులు వెలువరించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ సంస్థ తాను సేకరించిన డిపాజిట్ల మొత్తంలో సగం విలువ మేరకు నష్టాలను కలిగి ఉందని వచ్చిన వార్తల నేపథ్యంలో డిపాజిటర్ల ప్రయోజనాల దృష్ట్యా ఈ వ్యవహారాన్ని పరిశీలించేందుకు అప్పటి ఆర్థిక శాఖ సలహాదారు ఎన్‌.రంగాచారిని నియమిస్తూ జీవో నెంబర్‌ 800 జారీచేసింది.

అలాగే ఈ సంస్థపై ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్‌ 45(టి), సెక్షన్‌ 58(ఇ) కింద చర్యలు తీసుకునేందుకు వీలుగా న్యాయస్థానంలో కేసు ఫైల్‌ చేసేందుకు అప్పటి సీఐడీ ఐజీ కృష్ణ రాజును జీవో నెంబర్‌ 801 ద్వారా అధీకృత అధికారిగా నియమించింది. ఎన్‌.రంగాచారి ఇచ్చిన నివేదిక ఆధారంగా కృష్ణరాజు 23 జనవరి 2008న ఫస్ట్‌ అడిషనల్‌ చీఫ్‌ మెట్రొపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో సీసీ నెంబర్‌ 540 దాఖలు చేశారు. దీనిపై విచారణ నిలిపివేయాలని మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. 2010లో ఈ పిటిషన్‌ను ఆ న్యాయస్థానం తోసిపుచ్చింది.

ఈ ఉత్తర్వులను పక్కనపెట్టాలని కోరుతూ తిరిగి 2011లో మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ సంస్థ హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం సీసీ నెంబర్‌ 540లో క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌పై స్టే ఇచ్చింది. అయితే ఏ కేసులోనైనా స్టే ఉత్తర్వులు ఆ రోజు నుంచి ఆరు నెలల తరువాత రద్దవుతాయని సుప్రీంకోర్టు 2018 మార్చి 28న తీర్పు వెలువరించింది. విచారణ కొనసాగించడం కంటే స్టే పొడిగించడమే అవశ్యమనుకున్న కేసుల్లో స్టే కొనసాగింపునకు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ సంస్థ స్టే పొడిగించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

కానీ స్టే పొడిగించేందుకు ధర్మాసనం నిరాకరించింది. దీంతో మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ హైకోర్టును ఆశ్రయించింది. 2011లో తాము దాఖలు చేసిన క్రిమినల్‌ పిటిషన్‌ను విచారించాలని అభ్యర్థించింది. దీనిని విచారించిన ఉమ్మడి హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై ఉన్న క్రిమినల్‌ సీసీ నెంబర్‌ 540ని కొట్టివేసింది. దీనిపై ఉండవల్లి అరుణ్‌కుమార్‌ తరఫున న్యాయవాది అల్లంకి రమేశ్‌ ఇప్పుడు సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేశారు.

మరిన్ని వార్తలు