-

ఆరెస్సెస్ పత్రికల్లో ఉద్వాసనల పర్వం

23 Jan, 2016 18:42 IST|Sakshi
ఆరెస్సెస్ పత్రికల్లో ఉద్వాసనల పర్వం

న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ఆధ్వర్యంలో వెలువడుతున్న ‘పాంచజన్య (హిందీ), ఆర్గనైజర్ (ఇంగ్లీషు)’పత్రికల్లో ఉద్యోగుల ఉద్వాసన పర్వం మొదలైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ పత్రికలు లాభాల బాట పట్టడంతో లాభాలకు అనుగుణంగా తమ జీతాలను పెంచాలంటూ ఉద్యోగులు ఆందోళన చేయడమే వారు చేసిన పాపం. జీతాలు పెంచాలంటూ నిరసన వ్యక్తం చేసిన పాపానికి తమను యాజమాన్యం వేధిస్తోందంటూ 20 మంది ఉద్యోగులు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌కు లేఖ రాశారు. ఆ లేఖపై సంతకం చేసిన వారిని వరుసగా యాజమాన్యం ఉద్యోగాల నుంచి తొలగిస్తోంది. ఇప్పటికే 9 మందికి ఉద్వాసన లేఖలిచ్చి ఇంటికి పంపించింది.

 భగవత్‌కు పంపించిన లేఖపై తొలి సంతకం చేసిన పాంచజన్య సంపాదక వర్గంలో సీనియర్ సభ్యులైన అనుపమ శ్రీవాత్సవను అందరికన్నా ముందుగా టెర్మినేట్ చేశారు. ‘జనవరి నాలుగవ తేదీన హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్ నన్ను పిలిచి టెర్మినేషన్ లేఖ ఇచ్చారు. మూడు నెలల జీతానికి సంబంధించిన చెక్కును తీసుకోవాల్సిందిగా కూడా నన్ను కోరారు. అందుకు నేను ఒప్పుకోక పోవడంతో పోస్టల్ ద్వారా ఇంటికి చెక్కు పంపించారు. ఉద్యోగం నుంచి ఎందుకు తొలగిస్తున్నారన్న విషయం కూడా చెప్పలేదు. మూడు నెలల జీతం ఇచ్చి ఉద్యోగం నుంచి ఎప్పుడైనా తొలగించే అధికారం తమకుందన్న క్లాజ్‌ను పేర్కొన్నారు. డిసెంబర్ 2వ తేదీ, 2015లో నేను మోహన్ భగవత్‌కు లేఖ పంపించాను. అతి తక్కువ జీతాలకు భయం నీడలో బతుకుతున్నాం. ఈ అంశంలో జోక్యం చేసుకొని మా సమస్యలను పరిష్కరించండంటూ ఆ లేఖలో వేడుకున్నాం. ఆయన ఎలాంటి జోక్యం చేసుకోకపోవడమే కాకుండా ఆయనకు లేఖ రాశామన్న కారణంగా మమ్మల్ని యాజమాన్యం ఉద్యోగంలో నుంచి తొలగిస్తోంది’ శ్రీవాత్సవ మీడియాకు తెలిపారు. ఆమె 1992 నుంచి పాంచజన్యలో పనిచేస్తున్నారు.

భారత్ ప్రకాశన్ (ఢిల్లీ) లిమిటెడ్ కంపెనీ పాంచజన్య, ఆర్గనైజర్ పత్రికలను ఆరెస్సెస్ తరఫున ప్రచురిస్తోంది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రానప్పుడు యాజమాన్యం ఆర్థిక లావాదేవీల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేదని, పరిస్థితిని అర్థం చేసుకొని తాము అతి తక్కువ జీతాలకే పనిచేస్తూ వచ్చామని, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాణిజ్య ప్రకటనలు పెరగడం, వాటికి టారిఫ్‌లను కూడా యాజమాన్యం పెంచడం వల్ల కంపెనీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి లాభాల బాట పట్టిందని, అందుకని లాభాలకు అనుగుణంగా జీతాలను పెంచాలని డిమాండ్ చేయడంతో యాజమాన్యం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మోహన్ భగవత్‌కు రాసిని లేఖలో ఉద్యోగులు వాపోయారు. బలవంతంగా నలుగురు ఉద్యోగులను రాజీనామా ఎలా చేయించిందన్న విషయాన్ని కూడా వారు లేఖలో ప్రస్తావించారు. ఆర్గనైజర్ ఎడిటోరియల్ టీమ్‌లో సీనియర్ సభ్యుడిగా కొనసాగుతున్న దినేష్ పాండేతో పాటు తొమ్మిది మందిని ఇప్పటి వరకు ఉద్యోగాల నుంచి తొలగించారని శ్రీవాత్సవ మీడియాకు వివరించారు.

ఈ విషయమై భారత్ ప్రకాషన్ మేనేజింగ్ డెరైక్టర్ పరమానంద్ మొహారియాను మీడియా వివరణ కోరగా తమ ఉద్యోగులు మోహన్ భగవత్‌కు లేఖ రాసిన విషయం కూడా తనకు తెలియదని చెప్పారు. ఉద్యోగాలు తీసేయడం సంస్థ సంస్కరణల్లో భాగమని తెలిపారు. మరోవైపు ఉద్యోగాలు లేబర్ కమిషనర్‌ను ఆశ్రయించారు. కోర్టులో కేసు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆర్గనైజర్ ఇంగ్లీషు పత్రిక 1947, జూలై నెలలో ప్రారంభంకాగా, పాంచజన్య 1948, జనవరి 14న ప్రారంభమైంది. మోదీ అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే పత్రికల నిర్వహణ బాధ్యతలను భారత్ ప్రకాషన్ సంస్థకు అప్పగించి పరమానంద్‌ను మేనేజింగ్ డెరైక్టర్‌గా నియమించారు.

మరిన్ని వార్తలు