2019 ఎన్నికలను శాసించేది వాళ్లే!

11 Jun, 2018 19:10 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 2014లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో మొట్టమొదటి సారిగా ఓటు హక్కును వినియోగించుకున్న యువత 15 కోట్లు. 2019లో జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ఓటు హక్కును 13 కోట్ల మంది వినియోగించుకోబోతున్నారన్నది ఎన్నికల కమిషన్‌ తేల్చిన లెక్క. అంటే 28 కోట్ల మంది యువత 18 నుంచి 25 ఏళ్ల లోపువారే. వీరిలో ఎక్కువ మంది నిరుద్యోగులే ఉంటారన్న విషయం మన అందరికి తెల్సిందే. మన దేశ ఆర్థిక నిపుణలేమో 15 ఏళ్ల ప్రాయం నుంచి 65 ఏళ్ల వరకు వయస్సున్న వారందరిని ‘వర్కింగ్‌ ఫోర్స్‌’గానే పరిగణిస్తోంది.

15 ఏళ్లు వచ్చేసరికి యువత ఉద్యోగం కోసం వెతుకులాట ప్రారంభిస్తుందని, 65 ఏళ్లు దాటిన తరం చనిపోతారు లేదా పనిచేయరని ఆ నిపుణుల అంచనా. 15–65 ఏళ్ల సూత్రాన్ని తీసుకొని ఏటా ఎంత మంది నిరుద్యోగులు పుట్టుకొస్తారని, వారికి ఎలా ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. వర్కింగ్‌ ఫోర్స్‌ నుంచి 65 ఏళ్లు నిండిన ప్రజల డేటాను తీసేసి 15 ఏళ్లు నిండిన యువతను అందులోకి తీసుకొని వర్కింగ్‌ ఫోర్స్‌ను అంచనా వేస్తారు. ఏ రంగంలో ఎంత వర్కింగ్‌ ఫోర్స్‌ ఉంది? ఎంత వర్కింగ్‌ ఫోర్స్‌కు ఎంత జాతీయ స్థూలదాయం వస్తుంది? వద్ధి రేటంత? అన్న అంశాలను కూడా తీసుకొని నిరుద్యోగం–ఉపాధి అంశాలను అంచనా వేస్తారు.

ఏటా 2.5 కోట్ల మంది 15వ ఏటలో ప్రవేశిస్తున్నారు. ప్రభుత్వ  లెక్కల ప్రకారం వారంతా ఉద్యోగం కోసం ఎదురు చూసే వారే. కానీ వాస్తవంగా చాలా మంది యువత ఆ వయస్సుకు విద్యభ్యాసంలోనే ఉంటారు. ప్రపంచబ్యాంకు అంచనాల ప్రకారం వారిలో 1.56 కోట్ల మంది నిరుద్యోగులు ఉంటారు. అంటే, నెలకు 13 లక్షల మంది వర్క్‌ఫోర్స్‌లో చేరాల్సి ఉంటుంది. వివిధ భారతీయ ఆర్థిక సంస్థల అంచనాల ప్రకారం సగటులన ఏడాదికి 1.20 కోట్ల మంది నిరుద్యోగులు పుడతారు.

ఈ లెక్కలన్నింటిని లెక్కబెట్టారో, లేదోగానీ 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏటా రెండు కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తానంటూ నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఆయన పార్టీ బీజేపీ ఏటా రెండున్నర కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల ప్రణాళిక వాగ్ధానం చేసింది. ఏటా 60 లక్షల మందికి కూడా మోదీ ప్రభుత్వం ఉపాధి కల్పించలేకపోయింది. ఏటా 70 లక్షల మంది కొత్తగా ఈపీఎఫ్‌లు చేరుతున్నారంటే వారందరికి ఉద్యోగాలు వచ్చినట్లేగా అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలనే తనను విమర్శిస్తున్న వారిని ఉద్దేశించి అసహనంగా వ్యాఖ్యానించారు.

2017–2018 ఆర్థిక సంవత్సరాల మధ్య 70 లక్షల మంది ఈపీఎఫ్‌ ఖాతాలను తెరచినట్లు ఈపీఎఫ్‌ డేటా తెలియజేస్తోంది. వారిలో 25 ఏళ్ల లోపు వయస్సున్న వారి సంఖ్య 40 లక్షల మంది మాత్రమే. అంటే మిగతా 30 లక్షల మంది 25 ఏళ్ల కన్నా ఎక్కువ వయస్సున్న వారే. రిజిస్టర్‌కానీ ఉద్యోగులందరూ ఏడాదికి ఒక రూపాయి జరిమానాతో ఈపీఎఫ్‌ వద్ద తమ పేర్లను రిజిస్టర్‌ చేసుకోవాలంటూ ఈపీఎఫ్‌ కొత్త స్కీమ్‌ను తీసుకొచ్చింది. అప్పటికే ఉద్యోగాల్లో ఉన్న వారే ఎక్కువ మంది ఈ స్కీమ్‌ కింద తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది.

2016, నవంబరంలో పెద్ద నోట్ల రద్దు కారణంగా 1.26 కోట్ల మంది ఉపాధి కోల్పోయారని ‘సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ’కి చెందిన ఆర్థిక నిపుణలు మహేశ్‌ వ్యాస్‌ అంచనా వేశారు. ఆ తర్వాత 18 నెలల కాలంలో 6 లక్షల మందికి మాత్రమే తిరిగి ఉద్యోగాలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం 2017, మార్చి నెల నాటికి దేశంలో నిరుద్యోగ సమస్య 4.7 శాతం ఉండగా, అది 2018 మార్చి నాటికి ఆరు శాతానికి చేరుకుందంటే నిరుద్యోగ సమస్య ఎంతుందో ఊహించవచ్చు.

ఈ లెక్కల తికమకలను పక్కన పెడితే ఈ ఏడాది మార్చి నెలలో భారతీయ రైల్వే 90 వేల ఉద్యోగాలకు దరఖాస్తు కోరగా 2.8 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారు. తమిళనాడులో 9,500 టైపిస్ట్‌లు, స్టెనోగ్రాఫర్లు, విలేజీ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్ల పదవులకు 19 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 992 మంది పీహెచ్‌డీలు చేసినవారుకాగా, 23 వేల మంది ఎంఫిల్‌ చేసిన వారున్నారు. దేశంలో రోజురోజుకు నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రమవుతున్నదో అభ్యర్థుల సంఖ్యనుబట్టి అర్థం చేసుకోవచ్చు.

ఈ సమస్య తీవ్రతను అనుభవిస్తున్న మొదటిసారి, రెండోసారి ఓటు వేయనున్న 28 కోట్ల మంది యువత 2019 నాటి సార్వత్రిక ఎన్నికల ఫలితాలను ప్రధానంగా ప్రభావితం చేయనున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

క‌రోనాపై పోరు.. డాబ‌ర్ గ్రూప్ విరాళం

విధుల్లో చేరేందుకు నో చెప్పిన మాజీ ఐఏఎస్‌

వైద్య‌ సిబ్బందికి రెట్టింపు వేత‌నం: సీఎం

మాస్క్‌ లేకుంటే నో పెట్రోల్‌...

మే 1 వరకూ లాక్‌డౌన్‌ పొడిగింపు

సినిమా

లారెన్స్‌... లక లక లక

డీడీ నంబర్‌ వన్‌

పాడినందుకు పైసా ఇవ్వ‌రు: ప్ర‌ముఖ‌ సింగ‌ర్‌

రష్మిక అంటే క్రష్‌ అంటున్న హీరో..

నిజంగానే గ‌డ్డి తిన్న స‌ల్మాన్‌

ముకేష్‌పై శత్రుఘ్న సిన్హా ఘాటు వ్యాఖ్యలు