ఆన్‌లైన్‌ ఉద్యోగాల పేరిట మోసం

4 May, 2020 08:17 IST|Sakshi

దరఖాస్తు పేరిట వేలాది రూపాయలు వసూలు

ఆ తర్వాత ముఖం చాటేస్తున్న మోసగాళ్లు

పోలీసులను ఆశ్రయిస్తున్న బాధితులు

సాక్షి, బెంగళూరు(బనశంకరి): లాక్‌డౌన్‌ నేపథ్యంలో పలువురు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయి. దీనిని అవకాశంగా తీసుకున్న వంచకులు బెంగళూరులోని సిలికాన్‌సిటీలో ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, ఇళ్లనుంచే పనిచేసే అవకాశం కల్పిస్తామని చెప్పి డబ్బు తీసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. నగరంలో ఇద్దరు నిరుద్యోగులు వంచక ముఠా చేతికి చిక్కి నగదు కోల్పోయారు. లాక్‌డౌన్‌ తొలగించే వరకు ఉద్యోగం ఉండాలనే కారణంతో చాలామంది ఆన్‌లైన్‌ ఉద్యోగాలకోసం జాజ్‌ సెర్చ్‌పోర్టర్లను ఆశ్రయిస్తున్నారు. నగరానికి చెందిన శేఖర్‌ అనే వ్యక్తి ఉద్యోగం వేటలో ఉన్నారు. ఈక్రమంలో అతనికి జాబ్‌ సర్చ్‌ కంపెనీతో పోలిన కంపెనీ మెయిల్‌ ఐడీ నుంచి ఆఫర్‌ వచ్చింది. రిజిస్ట్రేషన్‌ పీజు చెల్లించాలని సూచించారు. దీనిని నమ్మిన శేఖర్‌ తన క్రెడిట్‌కార్డు ద్వారా  రూ.6,899  చెల్లించాడు. అంతటితో ఆగని వంచకులు కంపెనీ ఫీజుతో పాటు ఇతర అవసరాలంటూ మరింత నగదు డిమాండ్‌ చేశారు. కానీ ఇతనికి  ఎలాంటి ఉద్యోగం ఇవ్వలేదు. చెల్లించిన డబ్బు వెనక్కి ఇవ్వాలని అడగ్గా ముఖం చాటేశారు. దీంతో బాధితుడు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అదేవిధంగా 21 ఏళ్ల యువతి ఉద్యోగం కోసం ఆన్‌లైన్‌ పోర్టల్‌లో తన బయోడేటా వివరాలు ఉంచింది. ఐటీ కంపెనీలో ఉద్యోగం ఇస్తామని హెచ్‌ఆర్‌.గోకుల్, కే ఎస్‌.కుమార్‌ అనే వ్యక్తులు మెయిల్‌ పంపారు. అప్లికేషన్‌ ఫీజు కోసం రూ.1599  చెల్లించాలని సూచించారు. వారు చెప్పిన ప్రకారం ఫోన్‌ పే ద్వారా నగదు చెల్లించింది. అనంతరం క్లియర్‌ చార్జ్‌  చెల్లించాలని రూ.2వేలు లాగేశారు. అనంతరం మరింత నగదు ఇవ్వాలని కోరగా అనుమానం వచ్చిన ఆ యువతి తాను చెల్లించిన నగదు వెనక్కు ఇవ్వాలని కోరింది. దీంతో వంచకులు డబ్బు ఇవ్వకుండా వంచనకు పాల్పడ్డారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కాగా ఉద్యోగం వేటలో ఉన్న వారు ఉద్యోగాల ఆఫర్లపై అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా నగదు చెల్లించరాదని సైబర్‌క్రైం పోలీసులు సూచించారు.  

మరిన్ని వార్తలు