ఆ హీరోయిన్ నేను కాదు.. మరొకామె!

29 Jan, 2016 20:13 IST|Sakshi
ఆ హీరోయిన్ నేను కాదు.. మరొకామె!

కేరళ సోలార్ స్కాం మరో కొత్త మలుపు తిరిగింది. ముఖ్యమంత్రి కుమారుడు చాందీ ఊమెన్‌తో తనకు వివాహేతర సంబంధాలు ఉన్నాయంటూ వచ్చిన ఆరోపణలను కేసులో నిందితురాలు సరితా నాయర్ ఖండించింది. ఆయనతో తనకున్నవి కేవలం వ్యాపార సంబంధాలు మాత్రమేనని తెలిపింది. ''చాందీ ఊమెన్‌తో నాకు వివాహేతర సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దురదృష్టవశాత్తు ఆ స్టోరీల్లో హీరోయిన్‌ను నేను కాను.. సోలార్ కేసులో ఉన్న మరో నిందితురాలు. కానీ ఆ విషయాన్ని నిరూపించేందుకు నా దగ్గర ఆధారాలు లేవు కాబట్టి ఆమె పేరు బయట పెట్టడం లేదు. పైగా అలా బయటపెడితే వాళ్ల ప్రైవసీకి భంగం వాటిల్లుతుంది'' అని సరితా నాయర్ మీడియాతో వ్యాఖ్యానించింది. హోం మంత్రి తిరువంచూర్ రాధాకృష్ణన్ వద్ద చాందీ ఊమెన్, మరో మహిళ కలిసి దుబాయ్ వెళ్లినప్పటి వీడియో క్లిప్పింగులు ఉన్నట్లు విన్నానని, అయితే మంత్రివర్గంలో మార్పులు ఉంటాయన్న భయంతోనే రాధాకృష్ణన్ ఈ వీడియో క్లిప్పింగుల విషయాన్ని లీక్ చేసి ఉంటారని కామెంట్ చేసింది.

కంపెనీ పెట్టాలని సీఎం కోరారు
ఇక.. తన కొడుకుతో సహా ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఒక సోలార్ కంపెనీ స్థాపించాల్సిందిగా ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ తనను కోరారని సరితా నాయర్ మరో బాంబు పేల్చింది. పునరుత్పాదక ఇంధన వ్యాపారం చేసేందుకు కంపెనీ ఏర్పాటు గురించి ముఖ్యమంత్రితో తాను చర్చించినట్లు ఈ స్కాంపై విచారణ చేస్తున్న జస్టిస్ శివరాజన్ కమిషన్ ఎదుట ఆమె చెప్పింది. కేరళ రెన్యువబుల్ ఎనర్జీ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ పేరుతో ఒక సహకార సంస్థను ఏర్పాటుచేయాల్సిందిగా సీఎం కోరారని, అందులో ఆయన కొడుకు చాందీ ఊమెన్, ఇతర కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉండాలన్నారని ఆమె తెలిపింది. ఈ కంపెనీకి కావల్సిన సోలార్ ప్యానళ్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవచ్చని కూడా ఆయన అన్నారని చెప్పింది. 'స్టార్‌ఫ్లేమ్స్' అనే అమెరికన్ సంస్థలో చాందీ ఊమెన్ భాగస్వామి అని, కావాలంటే ఆ కంపెనీ నుంచి ప్యానళ్లు దిగుమతి చేసుకోవచ్చని తెలిపారని సరితా నాయర్ తెలిపింది.

మరిన్ని వార్తలు