కశ్మీర్ సీఎం ముఫ్తీకి అసంతృప్తి సెగ

6 Apr, 2016 09:36 IST|Sakshi
కశ్మీర్ సీఎం ముఫ్తీకి అసంతృప్తి సెగ

జమ్ము: జమ్ముకశ్మీర్లో బీజేపీ, పీడీపీల సారథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరి రెండ్రోజులయినా కాకముందే అసంతృప్తి జ్వాల రేగింది. ఒకప్పటి వేర్పాటువాది సజ్జద్ లోన్ తనకు కేటాయించిన పోర్ట్ఫోలియోపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. సజ్జద్ రాజీనామా పత్రాన్ని బుధవారం బీజేపీ హైకమాండ్కు పంపినట్టు ఆయన సన్నిహితులు చెప్పారు. మీడియాకు దూరంగా ఉన్న సజ్జద్ తన ఫోన్లను స్విచాఫ్‌ చేసుకున్నారు.

జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రిగా పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. బీజేపీకి చెందిన నిర్మల్ సింగ్ డిప్యూటీ సీఎంగా, మరో 21 మంది మంత్రులతో గవర్నర్ ఎన్ ఎన్ వోహ్రా ప్రమాణస్వీకారం చేయించారు. సజ్జద్ తనకు వైద్య, ఆరోగ్య శాఖ దక్కుతుందని భావించినట్టు ఆయన సన్నిహితులు చెప్పారు. కాగా ఆయనకు సాంఘిక సంక్షేమ శాఖను కేటాయించారు. దీంతో అసంతృప్తి చెందిన సజ్జద్ రాజీనామా చేశారు. స్థానిక బీజేపీ నాయకులతో కలిసేందుకు నిరాకరించారు. రాజీనామా నిర్ణయాన్ని మార్చుకోవాల్సిందిగా పీడీపీకి చెందిన ఆర్థిక మంత్రి హసీబ్ డ్రాబు.. సజ్జద్ను కోరారు. 2002లో హత్యకు గురైన పీపుల్స్ కాన్ఫరెన్స్ నాయకుడు అబ్దుల్ గిలానీ లోన్ చిన్న కుమారుడైన సజ్జద్ బీజేపీ కోటాలో కేబినెట్ మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. కుప్వారా జిల్లాలోని హంద్వారా నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. దివంగత ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ మంత్రివర్గంలో సజ్జద్ పశుసంవర్థక శాఖను నిర్వహించారు.

మరిన్ని వార్తలు