‘చైనాను అధిగమించనున్న భారత్‌’

2 Jan, 2020 10:30 IST|Sakshi

ఢిల్లీ: ఈ ఏడాది మొదటి రోజు (జనవరి1)న భారతదేశంలో మొత్తం 67,385 పిల్లలు జన్మించగా, ప్రపంచవ్యాప్తంగా 3,92,078 పిల్లలు పుట్టినట్లు యూనిసెఫ్‌ ఓ నివేదికలో వెల్లడించింది. ఈ నివేదికను పరిశీలిస్తే త్వరలోనే భారత్‌దేశ జనాభా చైనాను దాటుతుందని యూనిసెఫ్‌ అంచనా వేసింది. భారత్‌తో పాటు మరో ఏడు దేశాల్లో జన్మించిన శిశువులు.. ప్రపంచవవ్యాప్తంగా పుట్టిన పిల్లల సంఖ్యకు సగంగా నమోదవడం గమనార్హం. చైనా(46,299), నైజిరియా(26,039), పాకిస్తాన్(6,787), ఇండోనేషియా(13,020), అమెరికా(10,452), రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో (10, 247), ఇథియోపియా(8, 493) దేశాల్లో పిల్లలు జన్మించారని యునిసెఫ్‌ పేర్కొంది. అయితే ఈ ఏడాది మొదటి రోజు జన్మించిన పిల్లల సంఖ్యను గమనిస్తే.. చైనా కన్నా భారత్‌లోనే ఎక్కుగా నమోదైంది. 

2019 జూన్‌లో ఐక్యరాజ్యసమితి ప్రపంచ జనాభా నివేదికను వెల్లడించిన సందర్భంలో ఇండియా జనాభా.. వచ్చే దశా‍బ్దకాలంలో చైనాను అధిగమిస్తుందని చెప్పిన విషయం తెలిసిందే. ఏటా జనవరి 1న జన్మించిన శిశువుల గణనను యూనిసెఫ్‌​ నిర్వహిస్తుంది. ​2018లో 2.5 మిలియన్‌ శిశువులు జన్మించి మొదటి మాసంలోనే మరణించారని ఆ సంస్థ తెలిపింది. అయితే ఈ పిల్లలంతా ప్రసవ సమయంలో వచ్చే సమస్యలు, అంటు వ్యాధులతో మృతి చెందారని వెల్లడించింది. గత మూడు దశాబ్దాలగా ప్రపంచవ్యాప్తంగా ఐదు సంవత్సరాలలోపు మృతిచెందిన పిల్లల సంఖ్య సగానికి తగ్గినట్లు యూనిసెఫ్‌ పేర్కొంది.

మరిన్ని వార్తలు