సేద్యానికి నోట్ల సెగ..

21 Nov, 2018 14:13 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నోట్ల రద్దుతో చిన్న రైతులు చితికిపోయారని వ్యవసాయ మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ కమిటీకి సమర్పించిన నివేదికలో పేర్కొంది. నోట్ల రద్దుపై విపక్షాల విమర్శలను తిప్పికొడుతూ బ్లాక్‌ మనీ నియంత్రించేందుకు ఇది అవసరమని ఇన్నాళ్లూ మోదీ సర్కార్‌ సమర్ధించగా తాజాగా నోట్ల రద్దుతో రైతులకు ఇబ్బందులు ఎదురయ్యాయని ఈ నిర్ణయం వెలువడిన  రెండేళ్ల తర్వాత వ్యవసాయ మంత్రిత్వ శాఖ తేల్చిచెప్పింది.

విత్తనాలు, ఎరువులు కొనేందుకు నగదుపై ఆధారపడే చిన్న రైతులు నోట్ల రద్దు నిర్ణయం ఫలితంగా సమస్యలు ఎదుర్కొన్నారని నివేదిక వెల్లడించింది. రబీ సీజన్‌కు ముందు నగదు కొరతతో లక్షలాది రైతులు విత్తనాలు, పురుగుమందులు కొనుగోలు చేయలేకపోయారని పార్లమెంటరీ కమిటీకి ఇచ్చిన నివేదికలో వ్యవసాయ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

నోట్ల రద్దు అమలైన సమయంలో రైతులు వారి ఖరీఫ్‌ దిగుబడులను అమ్ముకోలేక, రబీ పంటలను సాగుచేయలేక సమస్యల్లో కూరుకుపోయారని తెలిపింది. రైతుల చేతిలో ఉన్న నగదంతా నోట్ల రద్దుతో చెల్లుబాటు కాకుండా పోయిందని నివేదిక పేర్కొంది. ప్రభుత్వం సైతం విత్తనాలను విక్రయించలేదని, తమ పొలాల్లో పనిచేసే కార్మికులకు వేతనాలు చెల్లించాల్సి క్రమంలో పెద్ద రైతులు సైతం నగదు కొరతతో ఇబ్బందులు ఎదుర్కొన్నారని వెల్లడించింది.

నగదు కొరతతో నేషనల్‌ సీడ్‌ కార్పొరేషన్‌కు చెందిన 1.38 లక్షల క్వింటాళ్ల గోధుమ విత్తనాలు విక్రయానికి నోచుకోలేదని తెలిపింది. పాతనోట్లతోనూ గోధుమ విత్తనాలు కొనుగోలు చేయవచ్చని ప్రభుత్వం తర్వాత సడలింపు ఇచ్చినా పరిస్థితి మెరుగుపడలేదని పేర్కొంది.

మరిన్ని వార్తలు