సార్వత్రిక కనీస వేతనం సాధ్యమేనా!

1 Feb, 2017 09:13 IST|Sakshi
సార్వత్రిక కనీస వేతనం సాధ్యమేనా!

యూబీఐ దిశగా అడుగులు ఫలించేనా?
పౌరులందరికీ బేషరుతుగా నెలనెలా కనీస వేతనం చెల్లింపు
ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో పైలట్‌ప్రాజెక్టుల అమలు
భారత్‌లో 2011లో మధ్యప్రదేశ్‌లో యూనిసెఫ్‌ ప్రయోగం
పేదల ఆర్థిక, ఆరోగ్య స్థితిగతులు మెరుగుపడినట్లు వెల్లడి


‘‘భూమి తన సహజ స్థితిలో మానవ జాతికి ఉమ్మడి ఆస్తి’ కనుక.. ప్రతి వ్యక్తికీ సమానమైన ప్రాధమిక జీవనభృతి హక్కు ఉంటుంది.’’  అమెరికా తత్వవేత్త థామస్ పెయిన్
‘‘కనీస అవసరాలకు సరిపోయేంత నిర్దిష్ట స్వల్ప ఆదాయాన్ని అందరికీ బేషరతుగా అందించాలి’’  బ్రిటిష్ తత్వవేత్త బెర్ట్రాండ్ రసెల్


మనందరికీ ఏ పని చేసినా చేయకున్నా.. నెల నెలా కనీస మొత్తం వేతనంగా లభించ గలదా? చిన్నా పెద్దా తేడా లేకుండా, పేద ధనిక తేడా లేకుండా, ఆడా మగా తేడా లేకుండా, ఉద్యోగీ నిరుద్యోగీ తేడా లేకుండా ఆ మొత్తం ప్రతి నెలా లభిస్తుంటే ఏం జరుగుతుంది? జీవించే హక్కులాగానే.. జీవితాంతం నెల వారీ కనీస వేతనం పొందే హక్కు ఉంటే జీవనం ఎలా ఉంటుంది? ఇలాంటి హక్కు సాధ్యమవుతుందా?

ప్రపంచంలోని అత్యధిక దేశాల తరహాలోనే భారతదేశంలో కూడా ఎవరికైనా పని చేస్తేనే డబ్బు వస్తుంది. లేదంటే వివిధ ప్రభుత్వ పథకాల ప్రకారం దారిద్య్రరేఖకు దిగువున్న ఉన్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు నెల వారీ పింఛను లభిస్తుంది. అది సంపాదించుకోవడానికి వారు కూడా తమ ‘అర్హతల’ను నిరూపించుకోవాలి. అందుకు రకరకాల ధృవపత్రాలు, వివిధ అధికారులు, వైద్యుల ధృవీకరణలూ చూపించాలి. ఇక అధికారులు, సిబ్బందికి మామూళ్లు సమర్పించుకోవడం షరా మామూలే. అందులోనూ అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వారికే పెద్ద పీట వేస్తున్న దాఖలాలూ ఉన్నాయి. అమెరికాలోని అలాస్కా రాష్ట్రంలో ప్రతి పౌరుడికీ ఏటా 2,000 డాలర్ల వరకూ నగదును ఆ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది.. ఎటువంటి ప్రశ్నలు అడగకుండా..! ఈ ప్రయోజనం పొందడానికి గల ఒకే ఒక్క షరతు ఏమిటంటే.. కనీసం ఏడాది కాలంగా ఆ రాష్ట్రంలో నివసిస్తున్న పౌరుడై ఉండడంతో పాటు.. రాష్ట్రంలోనే స్థిరనివాసం ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలియజేస్తే చాలు. ఆర్కిటిక్ సర్కిల్ నుంచి చమురు వెలికితీత మీద లభించే రాయలిటీపై డివిడెండ్లను ఇలా ప్రతి ఏటా పౌరులకు చెల్లించటం అలాస్కాలో నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతోంది.

ప్రపంచంలో ఎంతకూ తరగని పేదరికాన్ని నిర్మూలించడానికి, పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటానికి, వారు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడానికి బేషరతుగా సార్వత్రిక కనీస వేతనాన్ని అందించాలన‍్న డిమాండ్లు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా బలపడుతున్నాయి. దారిద్య్రం నిర్మూలనకే కాదు.. పేదలపై అధికార యంత్రాంగం ఆధిపత్యానికి, అంచెలంచెల పంపిణీ వ్యవస్థలో అవినీతి చీడలకు.. ఇదే సరైన మందన్న గళం బలం పుంజుకుంటోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా యూబీఐ అమలు దిశగా యోచిస్తున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో యూబీఐ పూర్వాపరాలపై సాక్షి సమగ్ర కథనం...


ఏమిటీ యూబీఐ?
సార్వత్రిక కనీస ఆదాయం (యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్  యూబీఐ) అంటే.. ఎటువంటి నిబంధనలూ లేకుండా అవసరాల ప్రాతిపాదిక ఏదీ లేకుండా పని చేస్తున్నా చేయకున్నా ప్రతి ఒక్కరికీ నెల వారీ తరహాలో ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో అందించే కనీస జీవన భృతి.
►  ఒకేసారి ఏక మొత్తంగా అందించటం కాకుండా.. నెల వారీగా నిరంతర ప్రాతిపదికన చెల్లిస్తారు.
► గ్రహీతలు తమ అవసరాలు, ఇష్టానుసారం ఖర్చు చేసుకునే వీలు కల్పిస్తూ నగదు రూపంలో చెల్లిస్తారు.
► వ్యక్తి ప్రాతిపదికన చెల్లిస్తారు. గృహం లేదా కుటుంబం ప్రాతిపదికన కాదు.
► ప్రతి ఒక్కరికీ చెల్లిస్తారు. అవసరాలు, ఆర్థిక స్థాయి వంటి తేడాలేవీ ఉండవు.
► బేషరతుగా చెల్లిస్తారు. పని చేయాలన్న నిబంధన కానీ, పేదరికాన్ని నిరూపించుకోవాలన్న నిబంధన కానీ లేదు.

యూబీఐతో లాభాలెన్నో..!
స్వేచ్ఛ, సమానత్వం, సామర్థ్యం, సమాజం, భూమిపై సమాన యాజమాన్యం, సాంకేతిక ప్రగతి ప్రయోజనాల సమాన పంపిణీ, కార్మిక విపణి సరళీకరణ, పేదల ఆత్మగౌరవం, అమానవీయ పని పరిస్థితులపై పోరాటం, గ్రామీణ ప్రాంతాల విస్మరణపై పోరాటం, ప్రాంతీయ అసమానతలపై పోరాటం, వయోజన విద్యకు ప్రోత్సాహం, బాసులు, భర్తలు, అధికారుల నుంచి స్వయంప్రతిపత్తి వంటి ఎన్నో కారణాలను ఈ యూబీఐ అమలు అవసరం కోసం చూపుతున్నారు. ‘కనీస ఆదాయం’ అమలు వల్ల పూర్తిస్థాయిలో పారదర్శకత ఉంటుందని, సంక్షేమ వ్యవస్థ సరళమవుతుందని.. దీని అమలు కోసం కృషి చేస్తున్న సామాజిక కార్యకర్తలు, సంస్థల వాదన. అనేక రకాల సంక్షేమ పథకాల కన్నా సార్వత్రిక బేషరతు ఆదాయం ఒక్కటే సంక్షేమ కార్యక్రమంగా ఉండగలదనే వారూ ఉన్నారు. అయితే.. యూబీఐ అమలు చేసే సమయంలో.. ఆహారం, ఆరోగ్యం, విద్య తదితర మౌలిక సంక్షేమ పథకాలను కొనసాగించాల్సిందేననీ మరికొందరి వాదన.

వ్యయం తక్కువే: ప్రస్తుతం అవసరాలు, ఆర్థిక స్థితి ప్రాతిపదికన అందిస్తున్న సంక్షేమ ప్రయోజనాల అమలుకు అయ్యే వ్యయం కన్నా.. యూబీఐ అమలు వ్యయం తక్కువగానే ఉంటుంది.

పేదరిక నిర్మూలన: ప్రజలందరికీ యూబీఐ అమలుతో పేదరికం తగ్గిపోతుంది.. అసలు పేదరికన్నే ప్రపంచం నుంచి వేగంగా నిర్మూలించవచ్చు.

నేరాలు తగ్గుతాయి: యూబీఐని విజయవంతంగా అమలు చేసినట్లయితే చోరీలు, దొంగతనాల వంటి నేరాలు గణనీయంగా తగ్గుతాయి. వాటి నియంత్రణ కోసం చేసే వ్యయప్రయాసలూ తగ్గుతాయి.

అనారోగ్యాలు తగ్గుతాయి: కనీస వేతనం లభిస్తే.. పేదరికం కారణంగా, పోషకాహార లోపం కారణంగా అనారోగ్యాలు, మానసిక ఆందోళన, ఒత్తిడి వల్ల రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులు రావడం తగ్గుతుంది.

ఆర్థికాభివృద్ధి పెరుగుతుంది: నెల వారీ లభించే కనీస ఆదాయాన్ని ప్రజలు ఉన్నత చదువుల కోసం వెచ్చించే అవకాశం ఉంటుంది. తద్వారా మంచి ఉద్యోగాలు సంపాదించుకోగలరు. అది మొత్తంగా ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుంది.

నిజమైన స్వాతంత్య్రం: రాజకీయ స్వేచ్ఛ, వాక్‌స్వాతంత్య్రం, మత స్వాతంత్య్రం ఉన్నా కూడా.. ఆర్థిక స్వాతంత్య్రం లేకపోతే అవి పెద్దగా ఉపయోగపడవు. యూబీఐ వల్ల ప్రజలందరికీ ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుంది. అప్పుడు మిగతా స్వేచ్ఛలన్నిటినీ ఉపయోగించుకోవడం ద్వారా నిజమైన స్వాతంత్య్రం లభిస్తుంది.

వ్యతిరేకుల వాదన ఏమిటి?
యూబీఐని వ్యతిరేకించే వారిలో ప్రధానంగా రెండు వర్గాల వారు ఉన్నారు. ఒకరు.. పేదల సంక్షేమ బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పించుకోవడంలో భాగంగా యూబీఐని చూస్తారు. మరొకరు.. ప్రజలకు ఉచితంగా, బేషరతుగా డబ్బు లభిస్తే వారు పెద్దగా పనిచేయరని, సోమరులుగా మారతారని విమర్శిస్తారు. పని చేయడం తగ్గిపోతే ప్రభుత్వాలకు పన్నుల రాబడి తగ్గిపోతుందని, ప్రభుత్వ ప్రాజెక్టులకు నిధుల కొరత తలెత్తుతుందని వారి వాదన.

అధ్యయనాలు ఏం చెప్తున్నాయి?
ఐదు శాతం తగ్గిన పని గంటలు: యూబీఐ అమలు కోసం అమెరికా, కెనడా వంటి పలు దేశాల్లో పైలట్‌ప్రాతిపదికన అధ్యయనాలు నిర్వహించారు. అందులో ఈ ప్రయోజనం తాత్కాలికమైనదే అయినప్పటికీ.. ఉచిత వేతనం అందుకుంటున్న వారిలో పని గంటలు ఐదు శాతం మేర తగ్గినట్లు గుర్తించారు. అందులోనూ ప్రధానంగా ఇద్దరు కుటుంబ సభ్యులు పనిచేస్తున్న ఇంట్లో ప్రధాన సంపాదకుడి పని గంటలు స్వల్పంగా తగ్గితే.. రెండో సంపాదకుడి పని ఎక్కువగా తగ్గింది.

చదువుకు సమయం పెరిగింది: మనిటోబాలోని గ్రామీణ ప్రాంతమైన దౌఫిన్‌లో 1970లో నిర్వహించిన ‘మిన్‌కం’ ప్రయోగ అధ్యయనంలో.. కేవలం రెండు వర్గాలకు చెందిన వారిలోనే పని గంటలు తగ్గాయి. అందులో ఒకరు కొత్తగా తల్లులైన వారు,  రెండో వారు చదువుకుంటున్న యుక్తవయస్కులు. కనీస వేతనం అందడం వల్ల కొత్త తల్లులు తమ పని గంటలు తగ్గించుకుని తమ పిల్లల సంరక్షణకు ఎక్కువ సమయం కేటాయిస్తే.. తమ చదువులకు అవసరమైన ఖర్చు కోసం పనిచేస్తున్న యుక్తవయస్కులు పని గంటలు తగ్గించుకుని చదువులపై ఎక్కువ సమయం కేటాయించారు.

ఆర్థిక కార్యకలాపాలు పెరిగాయి: నమీబియాలోని ఒమిటారా అనే గ్రామంలో 200809లో పేదరికంలో మగ్గుతున్న పౌరుల కోసం చేసిన పైలట్‌ప్రాజెక్టు అధ్యయనంలో.. ఈ పథకం అమలు వల్ల వాస్తవంగా ఆర్థిక కార్యకలాపాలు పెరిగినట్లు గుర్తించారు. చిన్న వ్యాపారాలను ప్రారంభించడం, కొనుగోలు శక్తి పెరగడం వల్ల స్థానిక మార్కెట్‌బలపడటం వంటి సానుకూల పరిణామాలు నమోదయ్యాయి.


భారత్‌లో యూనిసెఫ్‌ప్రయోగం...
భారతదేశంలో ‘సార్వత్రిక కనీస వేతనం’ ప్రభావాలు, సామర్థ్యాలు, పరిణామాలను అధ్యయనం చేయటం కోసం 2011లో యూనిసెఫ్‌నిధుల సహాయంతో మధ్యప్రదేశ్‌లోని 8 గ్రామాల్లో రెండు పైలట్‌ప్రాజెక్టులను ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఆ గ్రామాల్లో ప్రతి వ్యక్తికీ  పురుషులు, మహిళలు, పిల్లలు అందరికీ  ఏడాదిన్నర కాలం పాటు  నెల వారీ చెల్లింపులు చేశారు. ఆరంభంలో పెద్ద వారికి రూ. 200 చొప్పున, పిల్లలకు రూ. 100 చొప్పున (తల్లి లేదా సంరక్షకులకు చెల్లించారు) ప్రతి నెలా అందించారు. తర్వాత దీనిని పెద్దలకు రూ. 300, పిల్లలకు రూ. 150 మొత్తానికి పెంచారు. ఒక గిరిజన గ్రామంలో కూడా ఇదే పథకాన్ని అమలు చేశారు. ఈ మొత్తాన్ని వ్యక్తిగతంగా తొలుత మూడు నెలల పాటు నగదు రూపంలో అందించారు. అనంతరం వారి వారి బ్యాంకు లేదా సహకార సంఘాల ఖాతాలకు జమ చేశారు. ఆహార రాయితీలకు ఈ చెల్లింపులకు ముడి పెట్టలేదు. ఎటువంటి నిబంధనలూ విధించలేదు. ఈ అధ్యయనం ఫలితాలను 2013 మే 3031 తేదీల్లో ఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో వెల్లడించారు.

1.    చాలా మంది ఈ నగదును తమ ఇల్లు, మరుగుదొడ్లు, గోడలు, పైకప్పులను మెరుగుపరచుకోవడానికి, మలేరియా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి ఉపయోగించారు.

2.    పోషకాహారం మెరుగుపడింది. ప్రత్యేకించి ఎస్‌సీ, ఎస్‌టీ వర్గాల వారి ఇళ్లలో ఈ మార్పు ప్రస్ఫుటంగగా ఉంది. చిన్న పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లల సగటు బరువు మెరుగుపడింది.

3.    చేతికి అందే నగదు కొంత పెరగడం వల్ల జనం రేషన్‌షాపుల నుంచి మార్కెట్‌కొనుగోలు వైపు మారారు. తాజా కూరగాయలు, పండ్లు, నాణ్యమైన ఆహార పదార్థాల స్వీకరణ వల్ల పిల్లల ఆరోగ్యం, శక్తి సామర్థ్యాలు మెరుగుపడ్డాయి.

4.    ఆరోగ్యం మెరుగుపడటం వల్ల పాఠశాలకు హాజరవడం, ఉత్తమంగా కృషి చేయడం పెరిగింది. పిల్లలకు యూనిఫాం కొనుగోలు చేయడం, పాఠశాలకు రవాణా చెల్లింపులు చేయగలగడం కూడా ఇందుకు మరో కారణం.

5.    తమ చేతిలో నగదు ఉండటం వల్ల ఇళ్లలో మహిళలు, వికలాంగుల సాధికారత మెరుగుపడింది.

6.    నెల వారీ నగదు అందుతుండటంతో చిన్న మొత్తం పెట్టుబడులు పెరిగాయి. మంచి విత్తనాలు, కుట్టు మిషన్లు, చిన్న దుకాణాల ఏర్పాటు, రిపేరు పరికరాలు తదితరాలు కొనుగోలు చేశారు. దీని ద్వారా ఉత్పత్తి పెరగడం, ఆదాయం పెరగడం వంటి ఫలితాలు వచ్చాయి.

7.    కనీస ఆదాయం ఫలితంగా శ్రమించడం, పని చేయడం పెరిగింది. అయితే.. అది రోజు కూలీ పని వైపు నుండి స్వయం ఉపాధితో కూడిన వ్యవసాయం, వ్యాపార కార్యక్రమం వైపు మారింది. కరవు వంటి పరిస్థితులతో వలసలు వెళ్లడం తగ్గింది. మహిళలకు అధిక ప్రయోజనం లభించింది.

8.    వెట్టి చాకిరి అనూహ్యంగా తగ్గిపోయింది. ఇది స్థానికంగా అభివృద్ధికి, సమానత్వానికి భారీ సానుకూల ప్రభావం చూపించింది.

9.    కనీస వేతనం పొందిన వారు తాత్కాలిక అవసరాలకు అప్పులు తీసుకోవాల్సిన అవసరం లేకపోవడంతో.. అప్పులు చేసి ఇబ్బందులు పడడం తగ్గిపోయింది. నిజానికి.. ఈ కనీస వేతనాన్ని వ్యతిరేకించిన వారు ఎవరైనా ఉన్నారా అంటే.. అది స్థానిక వడ్డీ వ్యాపారులు మాత్రమే.

10.  చాలా మంది కొంత నగదును దాచుకోవడం ద్వారా.. తీవ్ర అనారోగ్యం, ఇంట్లో మరణాలు వంటివి సంభవించినపుడు అప్పులు చేసి రుణ ఊబిలో కూరుకుపోకకుండా ఎదుర్కోగలిగారు.

భారత్‌లో అమలుకు ప్రధాన సవాళ్లు ఏమిటి?
మొదటి సవాలు జన సంఖ్య. దేశంలో దాదాపు 130 కోట్ల మంది జనాభా ఉన్నారు. వీరందరికీ పూర్తి స్థాయిలో యూబీఐ అమలు చేయడానికి భారీ స్థాయిలో నిధులు అవసరం. ఒక్కొక్కరికి ఏడాదికి రూ. 10,000 చొప్పున యూబీఐ ఇచ్చినా ఏటా 13 లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతాయి. మొత్తం మీద స్థూల జాతీయోత్పత్తిలో 10 శాతం వరకూ వ్యయం చేయాల్సి ఉంటుందని అంచనా. ఇది ప్రస్తుతం మొత్తం సంక్షేమ పథకాల కోసం వెచ్చిస్తున్న వ్యయం కన్నా దాదాపు రెట్టింపు.

రెండో సవాలు ప్రభుత్వ పథకాలు. యూబీఐని అమలు చేస్తే ప్రస్తుతమున్న ఏ సంక్షేమ పథకాలను తగ్గించాలనేది ప్రశ్నార్థకమవుతుంది. కనీస వేతనం ఇస్తున్నామన్న పేరుతో ప్రభుత్వం పేదలు, అణగారిన వర్గాల వారి కోసం అమలు చేసే అత్యధిక పథకాలను తొలగిస్తే వారి పరిస్థితి మరింతగా దిగజారుతుందనే ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి.   

---- సాక్షి నాలెడ్జ్‌సెంటర్‌
 

మరిన్ని వార్తలు