నిరుద్యోగుల ఊసే లేని బడ్జెట్‌

1 Feb, 2019 15:55 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశంలో నిరుద్యోగ సమస్య గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరుకుందని, 2017–2018 ఆర్థిక సంవత్సరంలో నిరుద్యోగ సమస్య 6.1 శాతానికి చేరుకుందని ‘నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆర్గనైజేషన్‌’ నివేదిక వివరాలు వెల్లడిస్తున్న విషయం తెల్సిందే. ఈ సమస్య 2019 సంవత్సరానికి ఎనిమిది శాతానికి కూడా తాకవచ్చని సర్వే అంచనా వేసింది. దేశంలో యువతకు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోదీ హామీ ఇవ్వడంతో ఎక్కువ మంది నిరుద్యోగ యువత నాడు ఆయన పార్టీకే ఓటు వేసింది. ముఖ్యంగా మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకున్న 15 కోట్ల మందిలో ఎక్కువ శాతం మంది బీజేపీకి ఓటు వేయడం వల్ల ఆ పార్టీకి 31 శాతం ఓట్లు వచ్చాయి.

2019 ఎన్నికల్లో 13 కోట్ల మంది మొదటిసారి ఓటు వేయబోతున్నారు. గ్రామీణ ప్రాంతాలకన్నా పట్టణ ప్రాంతాల్లో స్త్రీ, పురుషుల్లో నిరుద్యోగ శాతం గణనీయంగా పెరిగింది. పురుషుల్లో నిరుద్యోగుల సంఖ్య 18.7 శాతానికి చేరుకోగా, మహిళల్లో ఏకంగా 27.2 శాతానికి చేరకుంది. గతేడాది రైల్వేలో 63 వేల దిగువ, మధ్య స్థాయి ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానించగా ఏకంగా కోటీ 90 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో పీహెచ్‌డీలు కూడా చేసిన నిరుద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉండడం సమస్య తీవ్రతను తెలియజేస్తోంది.

రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిరుద్యోగ సర్వే వివరాలను బహిర్గతం చేసేందుకు అనుమతించలేదు. అనధికారికంగా నివేదికలోని అంశాలు వెలుగు చూశాయి. మోదీ ప్రభుత్వం గురువారం పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ ప్రతపాదనల్లో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వివిధ వర్గాలను మెప్పించేందుకు ప్రయత్నించడం కనిపిస్తోంది. అయితే అలాంటి ప్రతిపాదనల్లో కూడా నిరుద్యోగుల ఊసుకూడా లేకపోవడం శోచనీయం. ఈ నేపథ్యంలో 2014లో మొదటిసారి ఓటు హక్కును వినియోగించున్న వారిలో, 2019లో తొలిసారి ఓటు హక్కును వినియోగించుకుంటున్న వారిలో ఎంత మంది బీజేపీ పార్టీకి ఓటు వేస్తారన్నది ప్రశ్నే.

మరిన్ని వార్తలు