మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ. 1.7 లక్షల కోట్లు...

1 Feb, 2020 12:49 IST|Sakshi

న్యూఢిల్లీ: రవాణా రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర బడ్జెట్‌లో రూ. 1.7 లక్షల కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. 2020-21 సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను శనివారం నిర్మల పార్లమెంట్‌లో ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. 2023 కల్లా ఢిల్లీ- ముంబై ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణం పూర్తి చేస్తామని.. చెన్నె- బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణం త్వరలోనే ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ముంబై- అహ్మదాబాద్‌ మధ్య త్వరలో హైస్పీడ్‌ రైలు ప్రారంభం కానుందన్నారు. రైల్వేల్లో సోలార్‌ విద్యుత్‌ వినియోగం పెంచి.. రైల్వే లైన్‌ విద్యుదీకరణ చేపడతామని తెలిపారు. అదే విధంగా బెంగళూరులో సబర్బన్‌ రైల్వే ప్రాజెక్టు కోసం రూ. 1800 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. పర్యాటక అభివృద్ధికై తేజాస్‌ వంటి మరిన్ని రైళ్లను అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. రైల్వేల్లో మరింత ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నామని... ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్య(పీపీపీ) పద్ధతిలో 150 రైళ్లు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు.(మరింత ఈజీగా జీఎస్టీ...)

అదే విధంగా ఉడాన్‌ పథకం కింద 2024 నాటికి వంద ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. నేషనల్‌ గ్యాస్‌ గ్రిడ్‌ను విస్తరిస్తామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా డేటా సెంటర్‌ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని.. లక్ష గ్రామ పంచాయతీలకు ఆప్టికల్‌ ఫైబర్‌ అందుబాటులోకి రానుందని తెలిపారు. విద్యుత్‌​ రంగానికి రూ. 22, 000 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.(బడ్జెట్‌ 2020 : కేంద్ర బడ్జెట్‌ హైలైట్స్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

మరిన్ని వార్తలు