కశ్మీర్‌, లదాఖ్‌లకు భారీ కేటాయింపులు..

1 Feb, 2020 13:53 IST|Sakshi

న్యూఢిల్లీ : ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత రెండు కొత్త కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పడిన జమ్మూకశ్మీర్‌, లదాఖ్‌లపై కేంద్రం వరాల జల్లు కురిపించింది. 2020-21 సంవత్సరానికి గాను జమ్మూకశ్మీర్‌కు రూ. 30,757 కోట్లు, లదాఖ్‌కు రూ. 5,958 కోట్లు కేటాయిస్తున్నట్టు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. అలాగే దేశంలోని ఐదు పురావస్తు కేంద్రాల అభివృద్దికి, ఆధునీకరణకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. కేంద్ర బడ్జెట్‌పై నిర్మల మాట్లాడుతూ.. హరియాణాలోని రాఖీగర్‌, ఉత్తరప్రదేశ్‌లోని హస్తినాపూర్‌, అసోంలోని శివసాగర్‌, గుజరాత్‌లోని ధలోవిరా, తమిళనాడులోని ఆదిచానాల్లురు ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. రాంచీలో ట్రైబల్‌ మ్యూజియం.. అహ్మదాబాద్‌లో మ్యారిటైమ్‌ మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్టు నిర్మల ప్రకటించారు.

పారిస్‌ పర్యావరణ ఒడంబడికకు కట్టుబడి ఉన్నాం...
పర్యావరణ రక్షణకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్న నిర్మల.. పారిస్‌ పర్యావరణ ఒడంబడికకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. 10 లక్షలు జనాభా దాటిన పెద్ద నగరాల్లో పరిశుభ్రమైన గాలి లభించడం సమస్యగా మారిందని నిర్మల పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆయా నగరాల్లోని ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించడం కోసం మొక్కలు నాటనున్నట్టు నిర్మల చెప్పారు. నగరాల్లో కాలుష్య నివారణ కోసం రూ. రూ. 4400 కోట్టు కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. జాతీయ భద్రత అనేది తమ ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. గ్రామీణ భారతానికి శుద్ధమైన తాగునీటిని అందించడానికి జల్‌ జీవన్‌ మిషన్‌కు రూ. 3.6 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్ట ప్రకటించారు. 

రవాణా రంగం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక..
రవాణా రంగం అభివృద్ధికి ప్రత్యేక వ్యుహాలను సిద్దం చేసినట్టు నిర్మల చెప్పారు. రైల్వేల్లో ప్రైవేటీకరణను మరింతగా పెంచనున్నుట్టు తెలిపారు. పీపీపీ పద్ధతిలో 150 రైళ్లను నడపనున్నట్టు వెల్లడించారు. అలాగే వచ్చే నాలుగేళ్లలో 100 కొత్త ఎయిర్‌పోర్ట్‌లను అభివృద్ధి చేస్తామన్నారు. 2023 నాటికి ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస​ హైవే పూర్తి చేస్తామన్నారు. పెద్ద సంఖ్యలో తేజాస్‌ తరహా రైళ్లు, సెమీ హైస్పీడు రైళ్లను తీసుకురావడం ద్వారా రవాణా రంగాన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు