రైతుల ఆదాయం రెట్టింపు సాధ్యమా!?

1 Feb, 2020 15:03 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ : 2022 ఆర్థిక సంవత్సరం నాటికి దేశంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం 2020వ ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో ప్రధానాంశం. అందుకోసం సేంద్రియ వ్యవసాయం (ఆర్గానిక్‌ ఫామింగ్‌) చేసే రైతులను ప్రోత్సహించడంతోపాటు పైసా ఖర్చు లేకుండా ప్రకృతి ఆధారిత వ్యవసాయాన్ని (జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫామింగ్‌) ప్రోత్సహిస్తామని చెప్పారు. 

దేశ జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు గత 12 ఏళ్లలో ఎన్నడూ లేని కనిష్ట స్థాయికి (ఐదు శాతానికి) చేరుకున్న నేటి పరిస్థితుల్లో అందులో వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత రంగాల వృద్ధి రేటు కేవలం 2.8 శాతానికి పరిమితం అయినప్పుడు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం సాధ్యమేనా? దేశంలో దాదాపు 60 కోట్ల మంది వ్యవసాయం ఆధారపడి బతుకుతున్నప్పటికీ జీడీపీలో వ్యవసాయం వాటా 18 శాతానికి మించనప్పుడు మరెలా సాధ్యం?

దేశంలోని సాధారణ రైతులకు ఎరువులపై, విత్తనాలపై గత ప్రభుత్వాలు సబ్సిడీలు మంజూరు చేయగా, ఆ సబ్సిడీలు ఆశించిన రీతిలో రైతులకు చేరడం లేదని భావించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం డీబీటీ పథకం కింద రైతులకు హెక్టార్‌కు ఐదువేల రూపాయల చొప్పున నేరుగా నగదు బదిలీ చేస్తూ వస్తోంది. అలాగే ఐదెకరాలు భూమి మించని రైతులకు ఏటా ఆరు వేల రూపాయల నగదు బహుమతిని గత ఎన్నికల ముందు మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ తర్వాత భూమి పరిమితిని ఎత్తివేస్తున్నట్లు ఓ పత్రికా ప్రకటన చేసింది. ఈ నగదు బహుమతి వల్ల వ్యవసాయ భూమి కలిగిన రైతులు లాభపడ్డారుగానీ, కౌలుదారులెవరికీ నయా పైసా లాభం చేకూరలేదు. పదెకరాలలోపు వ్యవసాయం చేసే భూముల్లో ఎక్కువ మంది కౌలుదారులే ఉన్నారు. దేశంలో ఎంత మంది కౌలుదారులున్నారో లెక్కించేందుకు దేశంలో ఇంత వరకు ఏ కసరత్తు జరగతేదు కనుక వారి సంఖ్యను చెప్పలేం.

సేంద్రీయ వ్యవసాయదారులను కూడా ప్రోత్సాహిస్తామని బడ్జెట్‌ ప్రసంగంలో నిర్మలా సీతారామన్‌ హామీ ఇచ్చారంటే సాధారణ రైతులకు హెక్టారుకు ఐదువేల రూపాయల నగదును బదిలీ చేసినట్లే వారికి కూడా ఆ నగదును బదిలీ చేస్తారని ఆశించవచ్చు. ఎందుకంటే ఇంతవరకు వారికి అలాంటి సాయం చేయడం లేదు. నయా పైసా ఖర్చు లేకుండా ప్రకృతిపరంగా చేసే వ్యవసాయాన్ని కూడా ప్రోత్సాహిస్తామని చెప్పారు. అదెలాగో పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తేగానీ తెలియదు.

ఇదే బీజేపీ ప్రభుత్వం హయాంలో 2018లో పండించిన పంటలకు కనీస మద్ధతు ధరలు లభించక దేశంలోని రైతులు పలుసార్లు ఆందోళనలు, ఆ ఏడాది నవంబర్‌ నెల ఆఖరి వారం రోజుల్లో ఢిల్లీ, కోల్‌కతా, ముంబై నగరాలకు రైతులు భారీ ప్రదర్శనలు జరిపారు. వారు నిరసనగా కూరగాయలను, పాలను రోడ్ల మీద పారబోసారు. ఆ నేపథ్యంలో 2019 వార్షిక బడ్జెట్‌లో పైసా ఖర్చులేకుండా ప్రకతిబద్ధంగా వ్యవసాయం చేసే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ హామీ ఇచ్చారు. ఆ దిశగా పెద్దగా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. వ్యవసాయం అనేది రాజ్యాంగపరంగా ఇప్పటికీ రాష్ట్రానికి సంబంధించిన అంశం. రైతులకు సంబంధించి ఏ హామీనైనా చిత్తశుద్ధితో అమలు చేయాలన్నా కేంద్ర, రాష్ట్రాల మధ్య సరైన సమన్వయం, సహకారం ఉండాలి. అందుకు పథకం ప్రవేశపెట్టే దశలోనే రాష్ట్రాలకు అవసరమైన మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేయాలి. 

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమంటే ముందుగా వారికి గిట్టుబాటు ధర అందేలా చూడాలి. రాష్ట్రాల వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉండడం వల్ల రైతులకు సరైన న్యాయం చేయలేక పోతున్నామని భావించిన మోదీ ప్రభుత్వం ‘ఎన్‌ఏఎం (నామ్‌)’ జాతీయ వ్యవసాయ మార్కెటింగ్‌ను తీసుకొచ్చింది. రాష్ట్రాల పరిధిలో ఉన్న ‘వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌’ కమిటీలను నామ్‌లో విలీనం చేయాల్సిందిగా మోదీ ప్రభుత్వం ఆదేశించింది. దేశవ్యాప్తంగా 2,500 కమిటీలు ఉండగా 2019, నవంబర్‌ 12వ తేదీ నాటికి వాటిలో 16 రాష్ట్రాల్లోని 585 కమిటీలు మాత్రమే కేంద్ర కమిటీలో విలీనమయ్యాయి. కేంద్ర కమిటీ ఏర్పడినప్పటికీ దాని ఆధ్వర్యాన దేశవ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్లు, వాటికి అనుగుణంగా శీతల గిడ్డంగి కేంద్రాలు విస్తరించాలి. వ్యవసాయ ఉత్పత్తుల తరలింపునకు శీతల వాహనాలను ప్రవేశపెట్టాలి. రైతులకు నాణ్యమైన విత్తనాలతో నాణ్యమైన ఎరువుల అందేలా చూడాలి. ఇలా ఎన్నో చర్యలు అవసరం. 

నగదు బదిలీ వల్ల తమకు లాభం చేకూరడం లేదని, ఇంటి అవసరాలకు వాటిని వాడుకోవడం వల్ల విత్తనాలు, ఎరువులకు తిరిగి అప్పులు చేయాల్సి వస్తోందని, ఆ స్కీమ్‌ను రద్దు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘నీతి ఆయోగ్‌’ 2019, అక్టోబర్‌లో నిర్వహించిన ఓ సర్వేలో రైతులు వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం సాధ్యమేనా? ఇప్పుడు రైతులకు వస్తోన్న ఆదాయం ‘జీరో’ కనుక వారి ఆదాయాన్ని రెట్టింపు చేయడమంటే మరో జీరో చేర్చడం కాదుకదా! ఆ దిశగా నిజంగా చర్యలు తీసుకోవాలంటే డాక్టర్‌ స్వామినాథన్‌ కమిటీ సిఫార్సుల మేరకు మొదట వ్యవసాయ సంస్కరణలు తీసుకురావాలి. (బడ్జెట్‌ 2020 : కేంద్ర బడ్జెట్‌ హైలైట్స్‌)

మరిన్ని వార్తలు