కాలుష్యకారక థర్మల్‌ ప్లాంట్ల మూత

2 Feb, 2020 03:29 IST|Sakshi

స్వచ్ఛమైన గాలికోసం రూ. 4,400 కోట్ల కేటాయింపు

రైతులు సోలార్‌ విద్యుత్‌ అమ్మే విధంగా కొత్త ప్రతిపాదన

న్యూఢిల్లీ: వాయు కాలుష్యాన్ని నివారించేందుకు, గాలిలో స్వచ్ఛతను కాపాడేందుకు బడ్జెట్‌లో పర్యావరణ మంత్రిత్వ శాఖకు రూ. 4,400 కోట్లను కేంద్రం కేటాయించింది. దీనిలో భాగంగా పాతబడిన, కర్బన ఉద్గారాల నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా ఉండని థర్మల్‌ విద్యుదుత్పత్తి ప్లాంట్లను మూసేయనున్నట్లు నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఆ ప్లాంట్ల భూమిని వేరే అవసరాలకు వాడనున్నారు. డీజిల్, కిరోసిన్‌తో పనిలేని వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, రైతులు సౌర విద్యుత్‌వైపు మొగ్గుచూపడానికి ‘పీఎం కుసుమ్‌’ పథకాన్ని విస్తరిస్తున్నట్లు చెప్పారు. దేశంలో రైతులు 35 లక్షల సోలార్‌ పంపు సెట్లు ఏర్పాటు చేసేందుకు సహకరిస్తామన్నారు. దీనిలో 20 లక్షల మంది రైతులు సొంతంగా సోలార్‌ పంప్‌లను ఏర్పాటు చేసుకునేందుకు, మరో 15 లక్షల మందిని గ్రిడ్‌కు అనుసంధానం చేసేందుకు సహాయం చేస్తామన్నారు. తమ నిరుపయోగ భూమిలో రైతులు సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసి, గ్రిడ్‌కు అమ్మే పథకాన్ని మంత్రి ప్రతిపాదించారు. 

కొత్త విద్యుత్‌ ప్రాజెక్టులకు ఊతం
పవర్, పునరుత్పాదక ఇంధన రంగానికి ఈ బడ్జెట్‌లో రూ. 22,000 కోట్లు కేటాయించారు. కొత్త విద్యుత్‌ ప్రాజెక్టులకు కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు రూపంలో ప్రోత్సాహకాన్ని సమకూర్చుతామన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన దేశీయ ఉత్పత్తి సంస్థలకు 15 శాతం కార్పొరేట్‌ ట్యాక్స్‌ మినహాయింపు ఇచ్చే నిబంధనలను గత సెప్టెంబర్‌లో తెచ్చామని, దీనిని కొత్త విద్యుత్‌ ప్లాంట్లకు విస్తరిస్తున్నామన్నారు. ‘10 లక్షలు దాటిన జనాభా ఉన్న పెద్ద పట్టణాల్లో స్వచ్ఛమైన గాలి లభ్యత కష్టం. పెద్ద పట్టణాల్లో వాయు కాలుష్యాన్ని నివారించేందుకు ప్రణాళికలు రూపొందించే రాష్ట్రాలను ప్రోత్సహించాలని కేంద్రం భావిస్తోంది. దీనికి సంబంధించిన ప్రమాణాలను ఎన్విరాన్‌మెంట్, ఫారెస్ట్స్, క్లైమేట్‌ చేంజ్‌ మంత్రిత్వ శాఖ రూపొందిస్తుంది’ అని నిర్మల తెలిపారు. 

స్మార్ట్‌ విద్యుత్‌ మీటర్లు
సంప్రదాయ విద్యుత్‌ మీటర్లను ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లుగా వచ్చే మూడేళ్లలో మార్చాలని రాష్ట్రాలను నిర్మల కోరారు. దీనివల్ల తమకు నచ్చిన సరఫరాదారును, రేట్లను నిర్ణయించుకునే స్వేచ్ఛ వినియోగదారులకు వస్తుందని ఆమె తెలిపారు. 

మరిన్ని వార్తలు