క్రియాశీలకమైన బడ్జెట్‌

2 Feb, 2020 04:08 IST|Sakshi

ప్రధానమంత్రి నరేంద్రమోదీ

ఉద్యోగ కల్పనలో కీలకమైన రంగాలకు ప్రాధాన్యం

రైతు ఆదాయం రెట్టింపు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ

ఈ బడ్జెట్‌లో పెట్టుబడులు పెరుగుతాయని ప్రధాని ఆశాభావం

న్యూఢిల్లీ: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ దార్శనికమైన, క్రియాశీలకమైన, అద్భుతమైన బడ్జెట్‌ అని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ‘ఉద్యోగ కల్పనలో వ్యవసాయం, నిర్మాణరంగం, జౌళి, సాంకేతికత రంగాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నాలుగు రంగాలకు ఈ బడ్జెట్‌లో సముచిత స్థానం ఇచ్చాం’అని పేర్కొన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు 16 అంశాల కార్యాచరణ తీసుకొచ్చామని, దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగావకాశాలు పెరుగుతాయని వివరించారు. పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన అనంతరం మోదీ మీడియాతో మాట్లాడారు.

‘వ్యవసాయ రంగంలో సంప్రదాయ పద్ధతులకు సాంకేతికత జోడించడం ద్వారా ఉద్యాన, మత్స్య, పశుపోషణ రంగాల విలువ పెరుగుతుంది. దీంతో పాటు ఉద్యోగిత కూడా పెరుగుతుంది’అని మోదీ వెల్లడించారు. సాంకేతికత రంగంలో ఉద్యోగ కల్పన కోసం తాము ఈ బడ్జెట్‌లో అనేక చర్యలు తీసుకున్నామని తెలిపారు.  వీటితో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ శక్తిమంతంగా తయారవుతుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఆర్థిక సర్వేలో కూడా పేర్కొన్నట్లు గుర్తు చేశారు. డివిడెండ్‌ పన్ను తొలగించడంతో.. కంపెనీల చేతుల్లో దాదాపు రూ.25 వేల కోట్లు మిగులుతాయని, ఈ మొత్తాన్ని కంపెనీలు  పెట్టుబడులు పెట్టేందుకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు