‘పెస్టిసైడ్స్‌’ నియంత్రణకు బిల్లు

13 Feb, 2020 03:37 IST|Sakshi

ఈ సమావేశాల్లోనే సభలో ప్రవేశపెట్టనున్న కేంద్రం

బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లోనే పురుగు మందుల వ్యాపార నియంత్రణ బిల్లును సభలో ప్రవేశపెట్టనుంది. పురుగుమందుల వ్యాపార క్రమబద్ధీకరణతో పాటు, నకిలీ పురుగుమందుల కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం అందించే ప్రతిపాదనను కూడా బిల్లులో చేర్చారు. ఈ ‘పెస్టిసైడ్స్‌ మేనేజ్‌మెంట్‌ బిల్‌–2020’ని బుధవారం కేంద్ర కేబినెట్‌ ఆమోదించింది.  ‘ప్రస్తుతం పురుగుమందుల వ్యాపారం ఇన్‌సెక్టిసైడ్‌ యాక్ట్‌ – 1968 నిబంధనల ప్రకారం జరుగుతోంది. ఆ నిబంధనలకు కాలం చెల్లింది. అందుకే కొత్త బిల్లును రూపొందించాం’ అని సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు. రైతుల ప్రయోజనాలే ధ్యేయంగా,  వారికి సురక్షితమైన, ప్రభావశీలమైన పురుగుమందులు అందించడం, నకిలీ పురుగుమందులను అరికట్టడం లక్ష్యంగా ఈ బిల్లు రూపొందిందన్నారు.

ఆయా పురుగు మందులకు సంబంధించిన సమస్త సమాచారం డీలర్ల నుంచి రైతులకు అందేలా నిబంధనలు రూపొందించామన్నారు. అలాగే, సేంద్రియ పురుగుమందుల వాడకాన్ని ప్రోత్సహించే ప్రతిపాదనలను కూడా తాజా బిల్లులో చేర్చామన్నారు. నకిలీ రసాయన మందుల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు ఒక సెంట్రల్‌ ఫండ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. పెస్టిసైడ్స్‌ కంపెనీల నుంచి వసూలు చేసిన జరిమానాకు, అవసరమైతే కొంత కలిపి కేంద్రం ఆ ఫండ్‌ను ఏర్పాటు చేస్తుందన్నారు. పురుగుమందుల ప్రచారాన్ని క్రమబద్ధీకరించే ప్రతిపాదన కూడా తాజా బిల్లులో ఉందన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే పురుగుమందుల తయారీ సంస్థలకు రూ. 25 వేల నుంచి రూ. 50 లక్షల వరకు జరిమానా విధించే ప్రతిపాదనను ఆ ముసాయిదా బిల్లులో చేర్చారు. నిబంధనలను అతిక్రమించేవారికి జైలు శిక్షను ఐదేళ్లవరకు పెంచే ప్రతిపాదనను తాజా బిల్లులో చేర్చారు. 

మరిన్ని వార్తలు