జీఎస్టీ సవాళ్లపై ప్రత్యేక కమిటీలు

12 Sep, 2017 21:40 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: జీఎస్టీ అమలులో ఐటీ సవాళ్లు, ఎగుమతులపై ప్రత్యేక కమిటీలను నియమించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్‌లో జరిగిన జీఎస్‌టీ కౌన్సిల్‌ 21వ భేటీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం గ్రూప్‌ ఆఫ్‌ మినిష్టర్స్‌తో ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ కమిటీని నియమించినట్లు తెలిపింది. బీహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోదీ కమిటీని పర్యవేక్షించనున్నట్లు వివరించింది.

చత్తీస్‌ఘడ్‌ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి అమర్‌ అగర్వాల్‌, కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి కృష్ణ బైరెగౌడ, కేరళ ఆర్థిక శాఖ మంత్రి డా. టీఎమ్‌ థామస్‌ ఐసాక్‌, తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌లు కమిటీలో సభ్యులుగా వ్యవహరిస్తారని వెల్లడించింది. సుశీల్‌ కుమార్‌ మోదీ నేతృత్వంలోని కమిటీ వస్తు సేవల పన్ను(జీఎస్టీ) అమలులో ఐటీ నుంచి ఎదురవుతున్న సమస్యలను అధిగమించడానికి పని చేస్తుందని తెలిపింది.

ఎగుమతులపై నియమించిన కమిటీకి రెవెన్యూ శాఖ సెక్రటరీ నేతృత్వం వహిస్తారని వెల్లడించింది. ఎగుమతులలో ఏర్పడుతున్న అడ్డంకులు, జీఎస్టీ తర్వాత ఎగుమతులను పెంచేందుకు జీఎస్టీ కౌన్సిల్‌కు ఈ కమిటీ సలహాలు ఇస్తుందని తెలిపింది. ఈ కమిటీలో సీబీఈసీ చైర్మన్‌, డైరెక్టర్‌ జనరల్‌, డీజీఎఫ్‌టీ అడిషనల్‌ సెక్రటరీ, జీఎస్టీ కౌన్సిల్‌ డైరెక్టర్‌ జనరల్‌, ఎక్స్‌పోర్ట్స్‌ కమిషన్‌ డీజీ, గుజరాత్‌, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ల కమర్షియల్‌ ట్యాక్స్‌ కమిషనర్లు సభ్యులుగా ఉంటారని వివరించింది.

>
మరిన్ని వార్తలు