భారత్‌లో చదువుకోండి...స్కాలర్‌షిప్‌ అందుకోండి..

18 Apr, 2018 19:35 IST|Sakshi

న్యూఢిల్లీ : విదేశీ విద్యార్థులను ఆకర్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక నూతన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘స్టడీ ఇన్‌ ఇండియా’ పేరుతో ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా ఎక్కువ మంది విదేశీ విద్యార్థులను ఆకర్షించడమే కాక, ప్రపంచ స్థాయి విశ్యవిద్యాలయాలకు దీటుగా భారత వర్సిటీలను నిలపాలని యోచిస్తోంది. ఆస్ట్రేలియా, మలేషియా, సింగపూర్‌, కెనడాలో అమలులో ఉన్న ఈ కార్యక్రమాన్ని నేటి నుంచి మన దేశంలో కూడా అమలుపర్చనున్నారు.  ప్రస్తుతం భారతీయ విశ్యవిద్యాలయాల్లో ఉన్నత విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్ధులకు కేటాయిస్తున్న సీట్లు కేవలం 10 నుంచి 15శాతం మాత్రమే ఉన్నాయి. 

ప్రభుత్వం ప్రారంభించిన ‘స్టడీ ఇన్‌ ఇండియా’ కార్యక్రమం ద్వారా విదేశీ విద్యార్థులకు కేటాయించే సీట్లను పెంచడమే కాక రెండు సంవత్సరాల పాటు నిర్వహించే ఈ కార్యక్రమానికి రూ.150 కోట్ల నిధులను కేటాయిస్తున్నట్టు తెలిపింది. ప్రస్తుతం భారత్‌లో 45వేల మంది విదేశీ విద్యార్థులు మాత్రమే చదువుకుంటున్నారు.  2022నాటికి వీరి సంఖ్యను 1.50లక్షల నుంచి 2లక్షల వరకూ పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా 30 దేశాల విద్యార్థులను భారత్‌లో అభ్యసించేందుకు అనుమతిస్తుంది. వీటిలో ఆసియా, ఆఫ్రికా దేశాలతో పాటు నేపాల్‌, సౌదీ అరెబియా, నైజీరియా, థాయ్‌లాండ్‌, మలేషియా, ఈజిప్ట్‌, కువైట్‌, ఇరాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, భూటాన్‌ వంటి దేశాల విద్యార్థులకు అవకాశం కల్పించనున్నారు.ప్రతిభ ఉన్న విదేశీ విద్యార్థులను ఆకర్షించడానికి ప్రభుత్వం  ఫీజు రియంబర్స్‌మెంట్‌ను కూడా ప్రకటించింది.

మరిన్ని వార్తలు