వారంలోపే ఉరి తీయాలి!

23 Jan, 2020 04:22 IST|Sakshi

మరణశిక్ష అమలుపై మార్గదర్శకాలను మార్చండి

సుప్రీంకోర్టులో కేంద్రం పిటిషన్‌

న్యూఢిల్లీ: మరణశిక్ష పడిన దోషులను ఉరి తీసేందుకు డెత్‌ వారంట్‌ జారీ అయిన తరువాత వారం రోజులు మాత్రమే గడువు ఇవ్వాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ దిశగా ఆదేశాలివ్వాలని కోరుతూ కేంద్ర హోం శాఖ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఉరిశిక్షను వాయిదా వేసేందుకు ‘నిర్భయ’ దోషులు రివ్యూ పిటిషన్, క్యూరేటివ్‌ పిటిషన్, క్షమాభిక్ష.. తదితర చట్టపరమైన అవకాశాలను ఉపయోగించుకుంటున్న నేపథ్యంలో ఈ పిటిషన్‌ దాఖలైంది.

ఉరిశిక్షను అమలుచేయడానికి సంబంధించి.. దోషుల హక్కులను కాకుండా బాధితుల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని నిబంధనలు రూపొందించాల్సిన అవసరం ఉందని కేంద్రం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చింది. ‘క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన వారం రోజుల్లో డెత్‌ వారంట్‌ జారీ చేయాలి. ఆ తరువాత వారం రోజుల్లో ఉరి శిక్షను అమలు చేయాలి. సహ దోషుల రివ్యూ, క్యూరేటివ్, క్షమాభిక్ష పిటిషన్లు ఏ స్థాయిలో ఉన్నా వాటిని పట్టించుకోకూడదు. అన్ని కోర్టులు, రాష్ట్ర ప్రభుత్వాలు, జైలు అధికారులు దీన్ని అమలు జరిపేలా ఆదేశాలివ్వండి’ అని హోంశాఖ తన పిటిషన్‌లో కోరింది. దోషుల రివ్యూ పిటిషన్‌ను తిరస్కరించిన తరువాత క్యూరేటివ్‌ పిటిషన్‌ను దాఖలు చేసేందుకు కచ్చితమైన కాలపరిమితి విధించాలని కూడా హోంశాఖ కోరింది.

క్షమాభిక్ష కోరుకునే దోషి.. సంబంధిత కోర్టు జారీ చేసిన డెత్‌ వారంట్‌ తనకు అందిన వారం రోజుల్లోపే క్షమాభిక్ష కోరుకునే విధంగా నిబంధనలను రూపొందించాలని పేర్కొంది. ‘అత్యాచారం కేవలం ఒక వ్యక్తిపై చేసే నేరం కాదు. మానవత్వంపై జరిగిన ఘాతుకం. అది నాగరిక సమాజం క్షమించలేని దారుణం’ అని హోంశాఖ ఆ పిటిషన్‌లో పేర్కొంది. ‘అందువల్ల ప్రజలు, బాధితులు, వారి కుటుంబాల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని, దోషులను శిక్షించేందుకు ఉద్దేశించిన గత నిబంధనలను మార్చాలని.. చట్టంతో ఆడుకుని, శిక్ష అమలును వాయిదావేసే అవకాశం ఆ దారుణానికి ఒడిగట్టిన దోషులకు ఇవ్వవద్దని కోరుతున్నాం’ అని అభ్యర్థించింది. కేంద్ర హోం శాఖ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సుప్రీంకోర్టులో ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.  

మరిన్ని వార్తలు